
David Warner: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. సిడ్నీలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి సిడ్నీలోని మరౌబ్రా (Maroubra) ప్రాంతంలో న్యూ సౌత్ వేల్స్ (NSW) పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వార్నర్ పట్టుబడ్డారు. చెకింగ్ పాయింట్ సమీపంలోనే వార్నర్ తన వ్యాన్‌ను ఆపి పక్కకు పార్క్ చేయడాన్ని గమనించిన పోలీసులు, అతడి వద్దకు వెళ్లి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో వార్నర్ శరీరంలో ఆల్కహాల్ శాతం 0.104 గా నమోదైంది. ఇది చట్టబద్ధమైన పరిమితి (0.05) కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. దీంతో పోలీసులు వార్నర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడ్ని విడుదల చేస్తూ.. 2026, మే 7వ తేదీన సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
వార్నర్ ఎక్కడ ఉన్నారంటే?:
డేవిడ్ వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL 2026) లో కరాచీ కింగ్స్ (Karachi Kings) జట్టు తరపున ఆడుతున్నారు. లీగ్ మ్యాచ్‌ల మధ్య విరామం దొరకడంతో, తన కుటుంబంతో సమయం గడిపేందుకు వార్నర్ కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు. ఇక వార్నర్ నాయకత్వంలో కరాచీ కింగ్స్ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 9న పెషావర్ జల్మీతో జరగనున్న తదుపరి మ్యాచ్ సమయానికి వార్నర్ తిరిగి పాకిస్థాన్ చేరుకోవాల్సి ఉంది. కానీ న్యాయపరమైన సమస్యతో ఆయన పాక్ పర్యటనపై ప్రభావం చూపుతుంది.
బిగ్ బాష్ లీగ్ లో రికార్డులు:
డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, పలు దేశాల లీగ్ క్రికెట్‌లో తన జోరును కొనసాగిస్తున్నారు. గత బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో సిడ్నీ థండర్ జట్టు తరపున 8 మ్యాచ్‌ల్లో 433 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఈ సమ్మర్ సీజన్‌లో ఆయన రెండు అద్భుతమైన సెంచరీలు (హోబర్ట్‌పై 130*, సిక్సర్లపై 110*) నమోదు చేశారు. లీగ్‌లో అత్యధికంగా 86.6 సగటుతో పరుగులు సాధించి, టోర్నమెంట్ అఫీషియల్ టీమ్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యారు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్న వార్నర్, వచ్చే సీజన్‌లో 40వ ఏట అడుగుపెడుతున్నప్పటికీ, క్రికెట్ ఆడతానని ఇప్పటికే ప్రకటించారు. ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు అతడి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.