Reading Time: 2 minutes
West Bengal Elections 2026 Congress Tmc India Bloc Rift Manifesto

Congress vs TMC: కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పడిన ‘ఇండియా’ కూటమి ఐక్యత రాష్ట్రాల ఎన్నికల నాటికి కరిగిపోతోంది. ఈ పరిస్థితి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రంలో మమతా బెనర్జీతో కలిసి అడుగులు వేసే కాంగ్రెస్, బెంగాల్‌ గడ్డపై మాత్రం ఆమెను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ముస్లిం జనాభా అధికంగా ఉండే మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, పురూలియా జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పట్టును దెబ్బతీయాలని కాంగ్రెస్ వ్యూహం పన్నుతుంది.

READ ALSO: 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

ఇక్కడ అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు, హుమాయూన్ కబీర్ – అసదుద్దీన్ ఒవైసీల కూటమి పోటీ పడుతుండగా.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తన సర్వశక్తులూ ఒడ్డుతోంది. దార్జీలింగ్‌లో కూడా రాజీవ్ గాంధీ కాలం నాటి పాత సంబంధాలను గుర్తు చేస్తూ మమతకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది హస్తం పార్టీ. ఏప్రిల్ 9న మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగానే, కాంగ్రెస్ అగ్రనేతలు బెంగాల్‌లో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ 3 భారీ బహిరంగ సభలు, ప్రియాంక గాంధీ 3 ప్రధాన ర్యాలీలు, దళిత ఓటర్లను ఆకర్షించేందుకు ఎస్సీ, ఎస్టీ ప్రాబల్యం ఉన్న కూచ్ బెహార్, అలీపుర్దువార్, జల్పాయ్‌గురి ప్రాంతాల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ రోజు కోల్‌కతాలో మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలను కాంగ్రెస్ అస్త్రాలుగా మలుచుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో క్షీణించిన రక్షణ వ్యవస్థ, టీఎంసీ ప్రభుత్వ అక్రమాలు, ధరల పెరుగుదల, నిధుల నిలిపివేతపై అధికార పార్టీని ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. కేంద్రం నుంచి బెంగాల్‌కు రావాల్సిన రూ.2 లక్షల కోట్ల బకాయిల కోసం మమతా బెనర్జీ కేంద్ర దర్యాప్తు సంస్థల (ED, CBI) భయంతో పోరాడటం లేదని, ప్రజల హక్కులను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేరుగా విమర్శలు గుప్పిస్తుంది. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, టీఎంసీ విడివిడిగానే పోటీ చేసినప్పటికీ, అప్పట్లో ఇంతటి తీవ్రస్థాయి ఘర్షణ వాతావరణం ఈ పార్టీల మధ్య లేదని చెబుతున్నారు. కానీ ఈసారి మమత ఓటు బ్యాంకును చీల్చేలా కాంగ్రెస్ వేస్తున్న పదునైన వ్యూహాలు, భవిష్యత్తులో ‘ఇండియా’ కూటమి మనుగడపై, ఇరు పార్టీల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

READ ALSO: Chanakya Niti : మీ తలరాతను మార్చే చాణక్యుడి మాటలు.. దరిద్రం దాటి దర్జాగా బతకండి ఇలా!