Reading Time: 2 minutes
Operation Sindoor Movie Vivek Agnihotri To Direct Bhushan Kumar To Produce Film On Indias Military Strikes

భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక చర్య ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంను ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించనుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్టుగా ఈ మూవీ రానుంది. 2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన సైనిక చర్యలే ఈ చిత్రానికి నేపథ్యం. భారత సైన్యం చేసిన సాహసాలను ఈ సినిమాలో చూపించనున్నారు.

రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ ధిల్లాన్ రచించిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor: The Untold Story of India’s Deep Strikes Inside Pakistan) పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది. 2025 మే 6 నుంచి 10 మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ వెనుక ఉన్న వ్యూహాలు, సంఘటనలను పుస్తకంలో వివరంగా రాశారు. ఆ వివరాలను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడి కానున్నాయి. స్టార్ కాస్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

Also Read: CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

ఈ ప్రాజెక్ట్ గురించి వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ… ‘నిజానికి దగ్గరగా ఉండే కథలను చెప్పడంలోనే నాకు ఆసక్తి ఉంటుంది. ధైర్యం, ప్రొఫెషనలిజం, వ్యూహాత్మక స్పష్టతను ప్రతిబింబించే ఈ కథను నిజాయితీగా, థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించేలా తెరకెక్కించాలనుకుంటున్నా. ఈ సినిమా కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ విభాగాలతో కలిసి విస్తృత స్థాయిలో గ్రౌండ్ రీసెర్చ్ చేశాను. ప్రజలకు తెలిసిన దానికంటే ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైనది’ పేర్కొన్నారు. వివేక్ ఇప్పటికే సామాజిక-రాజకీయ అంశాలపై సినిమాలు తీసి గుర్తింపు పొందారు. ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈసారి కూడా దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాన్ని ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాకు ‘ఆపరేషన్ సిందూర్’తో పాటు ‘మిషన్ సిందూర్’, ‘హిందుస్తాన్ కా సిందూర్’, ‘సిందూర్ కా బద్లా’, ‘సిందూర్: ది రివెంజ్’ వంటి పలు టైటిల్స్‌ను పరిశీలించినట్లు తెలుస్తోంది. భారత్ సైనిక శక్తి, ఉగ్రవాదంపై పోరాటం, దేశభక్తి భావాలను ప్రతిబింబించే ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.