Reading Time: < 1 minute

ఆస్ట్రేలియా మహిళలతో శుక్రవారం ప్రారంభమైన ఏకైక డేనైట్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఓపెనర్లు జార్జియా వోల్ (2), ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్ (9) జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. కెప్టెన్ అలీసా హీలీ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయింది. 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎలిసె పెరీ ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పెరీ 62 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసి క్రీజులో నిలిచింది. ఆమెకు అనాబెల్ సదర్లాండ్ 20 (బ్యాటింగ్) సహకారం అందిస్తోంది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే ఆస్ట్రేలియా మరో 102 పరుగులు చేయాలి.

అంతకుముందు భారత్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడంలో ఆసీస్ బౌలర్లు సఫలమయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక టీమిండియా 62.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధాన (4), ప్రతీకా రావల్ (18) విఫలమయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (19), దీప్తి శర్మ (7), వికెట్ కీపర్ రిచా ఘోష్ (11), స్నేహ్ రాణా (5), సయాలి (7), క్రాంతి గౌడ్ (1) తక్కువ స్కోరుకే ఇంటిదారి పట్టారు. ఓపెనర్ షఫాలీ వర్మ 6 ఫోర్లతో 35 పరుగులు చేసింది. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్ 7 బౌండరీలతో 52 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన కాశ్వి గౌతమ్ అజేయంగా 34 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సదర్లాండ్ నాలుగు, హామిల్టన్ మూడు, బ్రౌన్ రెండు వికెట్లను పడగొట్టారు.