Reading Time: 3 minutes

అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు హడావుడి మొదలైంది. ప్రచార ఆర్భాటాలు, పరస్పర ఆరోపణలు జోరు అందుకున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధిపొందుతున్న మహిళలను అధికార పార్టీ ర్యాలీలకు రావాలని ఒత్తిడి చేస్తోందని అసోం కాంగ్రెస్ ప్రెసిడెంట్ గౌరవ్ గొగోయ్ ఈ మధ్య ఆరోపించడంతో రాష్ట్రంలో రాజకీయ చర్చను తీవ్రతరం చేసింది. అధికార భారతీయ జనతా పార్టీ ఈ ఆరోపణను తోసిపుచ్చింది. అయినా, ఈ ఉదంతం అసోంలో పాలన, పారదర్శకత, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై ఆందోళనలకు కారణమైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇవి కేవలం ఆరోపణలు కావు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వెలువడుతున్న పెద్ద కథనంలో భాగం. ఇటీవల కొద్ది సంవత్సరాలుగా, అసోం ప్రభుత్వం మహిళలు, ఆర్థికంగా బలహీనవర్గాలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించింది. ఆర్థిక సహాయ పథకాలు, సబ్సిడీలు, నేరుగా నగదు బదిలీ, పేదలకు అనుకూలమైన పాలనకు రుజువుగా ప్రచారం సాగింది. అయితే, పాలనకు, రాజకీయ సమీకరణలకు మధ్య రేఖ మరింత అస్పష్టంగా మారుతోందని విమర్శకులు వాదిస్తున్నారు.

పన్ను చెల్లింపుదారులు అందిస్తున్న డబ్బుతో సంక్షేమ పథకాలు పౌరులు అందరికీ నిష్పాక్షికంగా సేవచేయడానికి ఉద్దేశించబడ్డాయి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పొందేందుకు లబ్ధిదారులు రాజకీయ విధేయత ప్రదర్శించాలని భావిస్తే, అది ప్రభుత్వ తటస్థత, నిష్పాక్షికతపై ఇబ్బందికరమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇది ఓ ర్యాలీలేదా పథకం గురించి కాదు. సంక్షేమం ఓ హక్కుగా పరిగణిస్తారా లేదా రాజకీయ సాధనంగా, ఓ ఆయుధంగా మారుతుందా అన్నదాని గురించే ఆందోళన. రాజకీయ ఆరోపణలకు అతీతంగా అసోం నిరుద్యోగ సమస్యతో పోరాడుతోంది. పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. వేలాది విద్యావంతులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే, నియామకాల విషయంలో అనిశ్చితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయి. కొన్నిసార్లు ప్రవేశ పరీక్షలు అక్రమాల వల్ల రద్దవుతాయి. నియామక ప్రక్రియ సాగదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో, నిరుద్యోగం, ఇతర రాష్ట్రాలకు వలసలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం పెట్టుబడులు, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులను హైలైట్ చేస్తున్నా, స్థిరమైన దీర్ఘకాలిక ఉపాధి కల్పనపై స్పష్టతలేదు. దీంతో యువ ఓటర్లలో నిరాశ నిసృ్పహలను పెంచుతోంది.

అసోం ప్రభుత్వంపై పెరుగుతున్న రుణభారం మరో ముఖ్య సమస్య. కొన్ని ఏళ్లుగా రాష్ట్ర రుణ ప్రొఫైల్ గణనీయంగా పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు, సంక్షేమానికి ఆర్థిక సహాయం కోసం రుణాలు తీసుకోవడం సహజంగానే సమస్యాత్మకం కాదు. చాలా రాష్ట్రాలు అభివృద్ధి కోసం రుణాలపై ఆధారపడుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చే రాబడి, చేసే ఖర్చు మధ్య పోలిక సరిపోక, అంతరం పెరిగితే, ఇటువంటి రుణాల స్థిరీకరణ కష్టం అవుతుంది. రుణాల చెల్లింపు బాధ్యతలు పెరిగితే, భవిష్యత్‌లో విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి కార్యక్రమాలకు చేసే ఖర్చు తగ్గుతుంది. స్వల్పకాలిక ప్రజాదరణ పథకాలకు నిధులు సమకూర్చడానికి ఎక్కువగా రుణాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కాగా, ప్రభుత్వం మాత్రం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడులు మున్ముందు ఆర్థిక లాభాలను ఇస్తాయని వాదిస్తోంది. చివరికి ఓటర్లు అడిగే ప్రశ్న ఏమిటంటే, రుణాలు ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతున్నాయా లేక రాజకీయ ప్రయోజకరమైన ప్రకటనలకు నిధులు సమకూరుస్తున్నాయా అనే.

అసోంలో భూయాజమాన్యం భావోద్వేగాలకు సంబంధించిన సమస్యగా మిగిలింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, ఆయన భార్య భూసేకరణలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన ఆరోపణలు రాజకీయ వివాదానికి ఆజ్యం పోశాయి. అన్ని జిల్లాలలో విలువైన భూములను సందేహాస్పద పరిస్థితుల్లో సేకరించారని విమర్శకులు అంటున్నారు. ముఖ్యమంత్రి ఈ ఆరోపణలను ఖండించారు. అన్ని లావాదేవీలు పారదర్శకమైనవేనని, చట్టబద్ధమైనవేనని అంటున్నారు. అయినా, స్థానిక భూమి హక్కులు, గుర్తింపు రాజకీయాలతో ముడిపడి ఉన్న రాష్ట్రంలో ఈఆరోపణలకు చట్టపరమైన వివరణలు ముఖ్యమైనవే. ప్రజల నమ్మకం అనేది చట్టపరమైన సమ్మతిపై మాత్రమే కాకుండా నైతిక స్పష్టతపై కూడా ఆధారపడి ఉంటుంది. పారదర్శకత, స్వతంత్ర పరిశీలనవల్ల సందేహాలు తొలగవచ్చు. అవి లేనప్పుడు రాజకీయ కథనాలు శూన్యతకు దారితీస్తాయి.

ఎన్నికలకు సంబంధించిన మరో ముఖ్యమైన అంశం ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ. ముఖ్యంగా ముస్లిం వర్గాలు, కాంగ్రెస్ మద్దతుదారులలో లక్షలాది మంది పేర్లు తొలగించారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల కమిషన్ మాత్రం సవరణలలో నకిలీ ఓటర్లు, అనర్హులను మాత్రమే తొలగించేందుకు చేపట్టినట్లు చెబుతోంది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత, పారదర్శకత, సమగ్రత ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. అలాగే, నియోజకవర్గాల మునుపటి సరిహద్దులను చక్కదిద్దే కసరత్తు, అసోం అంతటా సాగింది. నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించారు. జనాభా హెచ్చుతగ్గులను తగ్గించేందుకు, అధికారికంగా చేపట్టిన ఈ కసరత్తు బిజెపికి రాజకీయపరంగా ప్రయోజనకరంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. పరిమితమైన మార్పులు రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి అయినా, ఎన్నికల లెక్కలపై దాని ప్రభావాన్ని విశ్వసించలేం. ఇది కాంగ్రెస్‌కు సంస్థాగత సవాళ్లను సృష్టించింది. పార్టీ ఫిరాయింపులవల్ల ఇప్పటికే కేడర్ నైతికత దెబ్బతింది. నెట్‌వర్క్‌లు, వనరుల సమీకరణపై ప్రభావం పడింది.

పాలక పార్టీ ఈ మార్పులను దానికి పెరుగుతున్న ఆదరణగా పేర్కొంటే, విమర్శకులు మాత్రం రాజకీయ ఒత్తిడి పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా, ఎన్నికలలో పోటాపోటీ ఎదురవుతున్న సమయంలో ప్రతిపక్షం నిర్మాణం బలహీనంగా ఉంది. రానున్న ఎన్నికలలో ఆర్థిక వనరులు కీలక పాత్ర వహిస్తాయి. బిజెపి సంస్థాగత బలం, నిధుల సేకరణ సామర్థ్యం దానికి ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తాయి. ప్రచారం, మీడియా సహకారం, బూత్ స్థాయి సమీకరణకు గణనీయమైన లాజిస్టికల్ మద్దతు అవసరం. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు, వనరుల పరిమితులు పెద్ద అడ్డంకి. సమైక్య ఎన్నికల అవగాహన లేకుండా, ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ఇది చరిత్రాత్మకంగా అధికార పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది.

సీట్ల పంపిణి, సమన్వయంతో కూడిన రాజకీయ కూటమి ఎన్నికల చిత్రాన్ని మార్చగలదు. కానీ ఐక్యత కుదరాలంటే, రాజీ, వ్యూహాత్మక స్పష్టత, పరస్పర విశ్వాసం అవసరం. పోటీ రాజకీయాల్లో సాధించడం కష్టమైన అంశమే. బిజెపి పాలనలో అసోం పాలన కేంద్రీకృతమైందని, కేంద్ర నాయకత్వమే నిర్ణయాలను చేస్తోందని విమర్శకులు వాదిస్తున్నారు. బలమైన నాయకత్వం సామర్థ్యం, వేగవంతమైన అమలును ఇది నిర్ధారిస్తున్నదని మద్దతుదారులు వాదిస్తున్నారు. నిర్ణయాత్మక పాలన, సంస్థాగత స్వయం ప్రతిపత్తి మధ్య సమతుల్యత సున్నితమైనది. స్వతంత్ర సంస్థలు, మీడియా స్వేచ్ఛ, బలమైన ప్రతిపక్షంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. ఓటర్లు, అధికారులు, రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి ఆరోపణలు, సంస్థాగత విశ్వసనీయతను బలహీన పరుస్తాయి.

అసోం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండగా, రాజకీయ పోరాటానికి రంగం సిద్ధమవుతోంది. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమ ప్రచారం, బలమైన నాయకత్వంపై బిజెపి ప్రచారం చేసే అవకాశం ఉంది. కాగా, ప్రతిపక్షం పెరుగుతున్న నిరుద్యోగం, హెచ్చిన అప్పులు, అవినీతి ఆరోపణలు, ఎన్నికల న్యాయబద్ధతపై ఆందోళనలపై దృష్టి పెడుతుంది. ఈ పోరాటం తీవ్రంగా ఉంటుందన్నది సుస్పష్టం. ప్రభుత్వ వ్యతిరేకతే మార్పునకు కీలకం కాగలదు. సంస్థాగతీకరణ, ఓటర్ల సమీకరణ నిర్ణయాత్మక అంశాలు. నిరుద్యోగం పెరుగుతూ ఉంటే, ఆర్థిక ఒత్తిడులు తీవ్రమైతే, ఆర్థికపరమైన ఆందోళనలు గుర్తింపు రాజకీయాలను దెబ్బతీస్తాయి. భూపరమైన, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఆరోపణలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. చివరికి తీర్పు అసోం ప్రజలదే. ప్రభుత్వాలను మార్చేందుకు ప్రజాస్వామ్యం పౌరులకు అధికారం అందిస్తుంది. మనస్సాక్షికి అనుగుణంగా, ఓటింగ్, సమాచార చర్చ, సంస్థాగత పారదర్శకత ఈ ప్రక్రియకు మూలస్తంభాలు. అసోం ప్రస్తుతం మార్పా?, కొనసాగింపా? అన్న డైలమాలో ఉంది. కేంద్రీకృత అధికారమా? జవాబుదారీ రాజకీయమా? అన్న డైలమాలో ఉంది. రాబోయే ఎన్నికలు ఎవరు పాలించాలో మాత్రమే కాదు, రానున్న సంవత్సరాలలో పాలన ఎలా ఉండాలో కూడా నిర్ణయిస్తాయి.  

– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)

( రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)