
ఎన్‌పిడిసిఎల్ చరిత్రలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు
మన తెలంగాణ/హైదరాబాద్ :
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పిడిసిఎల్) చరిత్రలోనే ఆదివారం అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,267 మెగావాట్లు నమోదయినట్లు సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. శనివారం నమోదైన 6,057 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను అధిగమిస్తూ, ఆదివారం 6,267 మెగావాట్లకు చేరుకోవడం ఎన్‌పిడిసిఎల్ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇది సంస్థ ముందస్తుగా తీసుకున్న ప్రణాళికాబద్ధమైన చర్యల ఫలితమని ఆయన స్పష్టం చేశారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. డిమాండ్ పెరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ నిరంతర పర్యవేక్షణ, దిశానిర్దేశంతో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకు సంస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నామని సిఎండి వివరించారు.