Reading Time: < 1 minute

74 శాతం సక్సెస్ రేటు

ఇంచార్జ్ చిన్నా రెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోందని ఇంచార్జ్ చిన్నా రెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతుండడంతో రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు భారీ ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న సిఎం ప్రజావాణికి తరలివస్తున్నారన్నారు. సుమారు 25 నెలల క్రితం ప్రారంభమైన సిఎం ప్రజావాణి ప్రతి వారంలో మంగళ, శుక్రవారాలలో నిర్వహిస్తూ ఇప్పటివరకు 24 సెషన్స్ పూర్తి చేసుకుందని తెలిపారు. రెండేళ్ల కాలంలో సిఎం ప్రజావాణిలో మొత్తం ఒక లక్షా 12 వేల 245 దరఖాస్తులు నమోదు కాగా, అందులో 64 వేల 558 దరఖాస్తులు పరిగణలోకి తీసుకొని 47 వేల 935 దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు.

మిగిలిన 47, 687 దరఖాస్తులు ప్రభుత్వ పథకాలు, విధానపరమైన ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాల్సినవి కావడం, ఉద్యోగాల కోసం సంబంధించినవి ఉన్నట్లు వెల్లడించారు. వీటిని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత శాఖలకు సిఫార్సు చేశామన్నారు. సిఎం ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారం 74 శాతం మేరకు ఉండడంతో ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని, ప్రజల్లో భరోసా పెరిగిందని, దీంతో వారంలో రెండు రోజులు సుమారు వేయి దరఖాస్తులు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. గల్ఫ్ లోని ఏడు దేశాలు సహా ఇతర దేశాలలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిఎం ప్రవాసి ప్రజావాణి కేంద్రాన్ని కూడా ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజావాణిలో దరఖాస్తులు రాసి ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్, ప్రతి శాఖ నుంచి అధికారులతో ప్రత్యేక డెస్కులు, వైద్య సహాయం కోసం మెడికల్ క్యాంపు, వృద్ధులు దివ్యాంగుల రవాణా కోసం బ్యాటరీ బగ్గి, వీల్ చైర్స్, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్, ప్రజలకు మంచినీటి సౌకర్యం, జీ.హెచ్.ఎం.సీ. ఆర్థిక సహకారంతో హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఐదు రూపాయల భోజనం వంటివి ప్రజావాణిలో కల్పించినట్లు తెలిపారు. సిఎం ప్రజావాణి రానున్న రోజుల్లో పరిష్కార శాతాన్ని మరింత మెరుగు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు.