
హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కీలక చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భక్తులకు పెద్ద సంఖ్యలో మట్టి గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది.సెప్టెంబర్ 13 నాటికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మొత్తం 1,33,000 మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 8 అంగుళాల సైజులో 80 వేల విగ్రహాలు, 1 అడుగు సైజులో 53 వేల మట్టి విగ్రహాలు ఉన్నట్లు వెల్లడించారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి పదార్థాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులకు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది. పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవాలి. గణేష్ ఉత్సవాలను పర్యావరణహిత పద్ధతుల్లో నిర్వహించాలని హెచ్‌ఎండీఏ భక్తులకు విజ్ఞప్తి చేసింది. మట్టి గణేష్ విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరింది.
పండుగల సమయంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హెచ్‌ఎండీఏ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం సమయంలో చెరువులు, సరస్సులు, ఇతర నీటి వనరులు కలుషితం కాకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తోంది.
హైదరాబాద్‌ను గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని హెచ్‌ఎండీఏ విజ్ఞప్తి చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయాలను కొనసాగించేలా మట్టి విగ్రహాలతో వినాయక చవితి జరుపుకోవాలని పిలుపునిచ్చింది.