ఓటీటీ వేదికలపై సరికొత్త కథలతో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు వస్తుంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి సిరీస్‌లలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆశ్రమ్’ ఒకటి. గత ఆరేళ్లుగా ఈ సిరీస్ ఓటీటీ ప్రియులను విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ 4వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఒకప్పుడు బాలీవుడ్లో లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన బాబీ డియోల్ కెరీర్ కొన్నాళ్లపాటు ఒడుదొడుకులకు గురైంది. అయితే ‘ఆశ్రమ్’ సిరీస్ ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా మార్చివేసింది. ఇందులో ఆయన ప్రతి నాయకుడి ఛాయలున్న ‘బాబా నిరాలా’ పాత్రలో జీవించారు. ఈ సిరీస్ విజయం ఆయనను డిజిటల్ స్పేస్‌లో ఒక సూపర్ స్టార్‌గా నిలబెట్టింది.
దిగ్గజ దర్శకుడు ప్రకాష్ ఝా తెరకెక్కించిన ఈ సిరీస్, ఒక స్వయం ప్రకటిత దొంగ బాబా చుట్టూ తిరుగుతుంది. ధర్మం, ఆధ్యాత్మికత ముసుగులో అధికారం, డబ్బు, రాజకీయం , నేర ప్రపంచాన్ని అతను ఎలా నడిపించాడనేది ప్రధాన కథాంశం. సమాజంలో జరిగే మూఢనమ్మకాలు, రాజకీయ-నేర సంబంధాలను దర్శకుడు ఎంతో నైపుణ్యంతో చిత్రీకరించారు.
సీజన్ 1ఆగస్టు 2020లో విడుదలైంది. ఇందులో మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. సీజన్ 2 నవంబర్ 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులోనూ మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. సీజన్ 3 రెండు భాగాలుగా ప్రసారమైంది. మూడవ సీజన్ ‘పార్ట్ A’ 2022లో (10 ఎపిసోడ్లు) ‘పార్ట్ B’ 2025లో (5 ఎపిసోడ్లు) స్ట్రీమింగ్ అయ్యాయి.
ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లలో కలిపి మొత్తం 33 ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. ఐఎమ్‌డీబీలో కూడా ఈ సిరీస్‌కు చాలా మంచి రేటింగ్ లభించింది. ప్రస్తుతం ఈ మూడు సీజన్లను ప్రేక్షకులు అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ వేదికగా ఉచితంగా చూడొచ్చు. మూడో సీజన్ చివరలో కథ ఎంతో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. బాబా నిరాలా నకిలీ సామ్రాజ్యం కూలిపోతుందా లేదా అతడు మళ్లీ తన చాకచక్యంతో తప్పించుకుంటాడా అనే ఉత్కంఠ సీజన్ 4పై భారీ అంచనాలను పెంచేసింది.




