Reading Time: 2 minutes
Hyderabad: జీవితాన్ని మార్చేసిన జైలు గోడలు.. కటకటాల్లో ఉంటూ పీజీ పూర్తి చేసిన 10 మంది ఖైదీలు

జైలు జీవితం అంటే శిక్ష అనుభవించే కాలం మాత్రమే కాదని.. దాన్ని తమ భవిష్యత్తును మార్చుకునే అవకాశంగా మలచుకోవచ్చని పది మంది ఖైదీలు నిరూపించారు. జైలు శిక్షను అనుభవిస్తూనే ఉన్నత విద్యను అభ్యసించి, ఏకంగా పీజీ పట్టాలను సాధించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ చేతుల మీదుగా తమ డిగ్రీ పట్టాలను అందుకున్నారు. ఈ పది మంది ఖైదీల్లో ఎనిమిది మంది ఎంఎస్సీ సైకాలజీ, మరో ఇద్దరు ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు. జైలు శిక్ష మధ్యలోనూ చదువుపై దృష్టి పెట్టి కోర్సులను విజయవంతంగా పూర్తి చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

పీజీ చదువుల్లో చేరకముందే వీరిలో చాలామంది విద్యావంతులే. కొందరు ఎల్‌ఎల్‌బీ పూర్తి చేయగా.. మరికొందరు ఇతర డిగ్రీలు సాధించారు. ఒకరు బీటెక్‌ కూడా చదివారు. అయితే కేసుల్లో శిక్ష పడిన తర్వాత జైలుకు వచ్చినా.. తమ చదువుకు మాత్రం బ్రేక్‌ ఇవ్వలేదు. సాధారణ కళాశాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఓపెన్‌ యూనివర్సిటీ అందించిన అవకాశాన్ని వినియోగించుకున్నారు. జైలులో ఉన్న సమయంలోనే చదువును కొనసాగిస్తూ పరీక్షలు రాసి పీజీ పట్టాలను సొంతం చేసుకున్నారు.

ఖైదీలు తమ జైలు కాలాన్ని సానుకూలంగా వినియోగించుకునేలా తెలంగాణ జైళ్లు, దిద్దుబాటు సేవల శాఖ పలు విద్యా కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. విద్యను కేవలం సర్టిఫికెట్‌ లేదా డిగ్రీ కోసం కాకుండా.. ఖైదీలలో ఆలోచనా విధానం, జ్ఞానం, నైపుణ్యాలను పెంచే సాధనంగా అధికారులు భావిస్తున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు విద్య వారికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. సమాజంలో తిరిగి కలిసిపోయి బాధ్యతాయుతంగా జీవించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కూడా విద్య అందిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన BRAOU 27వ స్నాతకోత్సవంలో తెలంగాణ జైళ్ల శాఖ తరఫున డీఐజీ డాక్టర్‌ డి. శ్రీనివాస్‌, చర్లపల్లి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ జి. ప్రమోద్‌ పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న ఖైదీలను వారు అభినందించి ప్రోత్సహించారు. తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పట్టాలను అందజేశారు. NAAC మాజీ డైరెక్టర్‌, BRAOU మాజీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వి.ఎస్‌. ప్రసాద్‌ కూడా స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.

జైలు గోడల మధ్య గడిపిన సమయాన్ని వృథా చేయకుండా పుస్తకాలతో స్నేహం చేసి పీజీ పట్టాలు సాధించిన ఈ పది మంది ప్రయాణం.. శిక్ష అనుభవిస్తున్న వారికి విద్య ఎంత కీలకమో చాటిచెబుతోంది. నిర్బంధ కాలాన్ని విద్య, నైపుణ్యాభివృద్ధి, పునరావాసానికి ఉపయోగించుకోవచ్చనే దానికి వీరి విజయం ఓ ఉదాహరణగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.