
Senior Star Heroes Movies: టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతున్న ఆ నలుగురు సీనియర్ అగ్ర హీరోలు ప్రస్తుతం ఒక విచిత్రమైన డైలమాను ఎదుర్కొంటున్నారు. ఒకే సమయంలో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ స్టార్లలో నాగార్జున, బాలకృష్ణ విడుదల తేదీల విషయంలో ప్రశాంతంగా కనిపిస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు మాత్రం అయోమయంలో మునిగిపోయారు. సరైన ప్లానింగ్ లోపించడమే ఈ స్టార్ హీరోల ప్రాజెక్టులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతుందా అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం AK47’ చిత్రం వాస్తవానికి అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో అక్టోబర్ 30కి షిఫ్ట్ అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన చేస్తున్న మరో చిత్రం సంక్రాంతి పండుగ బరిలో జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధిలోనే ఒకే హీరో నటించిన రెండు సినిమాలు థియేటర్లలోకి రావడం అభిమానులకు పండగే అయినా, మార్కెట్ బిజినెస్ పరంగా ఇది చాలా పెద్ద రిస్క్. ఓటీటీ ఒప్పందాల గడువులు, థియేట్రికల్ రన్ లెక్కలు వెంకీ ప్రాజెక్టులకు కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నాయి.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైతం సరిగ్గా ఇలాంటి సమస్యనో ఎదుర్కొంటున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’ సంక్రాంతి సీజన్‌లో జనవరి 13న విడుదలకు ఫిక్స్ అయింది. మరోవైపు ఓటీటీ అగ్రిమెంట్ల నిబంధనల కారణంగా ‘విశ్వంభర’ చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావాల్సిన ఒత్తిడి నెలకొంది. దర్శకులు బాబీ కొల్లి, అనిల్ రావిపూడి ఇద్దరూ పండుగ రిలీజ్ డేట్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో.. చిరు, వెంకీలకు తమ సినిమాల రిలీజ్ డేట్ల సర్దుబాటు పెద్ద తలనొప్పిగా మారింది. తమ చిత్రాలతో తామే పోటీ పడాల్సిన విచిత్ర పరిస్థితి వీరిద్దరికీ ఏర్పడింది.
చిరు, వెంకీ తమ చిత్రాల రిలీజ్ తేదీల క్లాష్‌తో సతమతమవుతుంటే.. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి సేఫ్ జోన్‌లో ఉన్నారు. వీరిద్దరూ తమ చిత్రాలతో తాము పోటీ పడే పరిస్థితి లేకుండా చూసుకున్నారు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ‘కింగ్ 100’, ‘దాదా’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఒకరితో ఒకరు నేరుగా ‘నువ్వా నేనా’ అంటూ తలపడేందుకు సిద్ధమయ్యారు. క్లియర్ ప్లానింగ్‌తో ఉండటంతో నాగ్, బాలయ్య చాలా కూల్‌గా ఉండగా.. చిరు, వెంకీల సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ మాత్రం ప్రస్తుతానికి సందిగ్ధంలోనే కొనసాగుతున్నాయి.