Reading Time: < 1 minute
Royal Enfield Classic 350 Price Hike New Prices Variants Specifications

Royal Enfield Classic 350: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తన బెస్ట్ సెల్లింగ్ బైక్ క్లాసిక్ 350 ధరలను కాస్త స్వల్పంగా పెంచింది. దీనితో మొత్తం 9 కలర్ ఆప్షన్లపై ధరల పెంపు ప్రభావం పడింది. వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.2,000 వరకు ధర పెరిగింది. ఎంట్రీ లెవల్ రెడ్డిచ్ రెడ్ నుంచి ప్రీమియం ఎమరాల్డ్, సిగ్నేచర్ వైట్ కలర్ వరకు కొత్త ధరలు వర్తిస్తాయి.

పెరిగిన ధరల విషయానికి వస్తే.. క్లాసిక్ 350లో బేస్ వేరియంట్ రెడ్డిచ్ రెడ్ ధర ఇప్పుడు రూ.1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మద్రాస్ రెడ్ ధర రూ.1.96 లక్షలు కాగా, మెడాలియన్ బ్రాంజ్ ధర రూ.2.01 లక్షలుగా ఉంది. ఇక కమాండో సాండ్, గోర్ఖా ఎడిషన్ ధరలు రూ.2.12 లక్షలుగా ఉన్నాయి. గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్ వేరియంట్ల ధర రూ.2.21 లక్షలకు చేరింది. టాప్-స్పెక్ ఎమరాల్డ్, సిగ్నేచర్ వైట్ కలర్ వేరియంట్ల ధరలు రూ.2.26 లక్షలుగా ఉన్నాయి. గత ఆగస్టులో మార్కెట్లోకి వచ్చిన గోర్ఖా ఎడిషన్‌పై సుమారు రూ.1,000 మాత్రమే ధర పెరగగా, ఎమరాల్డ్, సిగ్నేచర్ వైట్ వేరియంట్లపై పూర్తి రూ.2,000 పెంపు నమోదైంది.

ధర పెరిగినప్పటికీ.. బైక్ మెకానికల్‌గా ఎలాంటి మార్పులకు గురికాలేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో అదే 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్ 20.2hp పవర్, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. 2026లో చేసిన అప్‌డేట్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్లకు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు వచ్చాయి. అయితే బేస్ సింగిల్ ఛానల్ రెడ్డిచ్ రెడ్ వేరియంట్‌లో ఈ రెండు ఫీచర్లు అందుబాటులో లేవు.

క్లాసిక్ 350 ధరల పెంపు సమయంలో ఈ బైక్‌కు పోటీగా కొత్త మోడళ్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ట్రయంఫ్ ఇటీవల బొన్నెవిల్లే T4ను రూ.2.55 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఇందులో 350cc ఇంజిన్ ఉంది. అదే విధంగా ట్రయంఫ్ బొన్నెవిల్లే T40ను రూ.2.80 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో తీసుకొచ్చింది. వీటితో పాటు హోండా CB350 కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కు ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతోంది.