
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు.
ఈ నిరసనలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
లోక్‌భవన్ ముట్టడికి యత్నం
అంతకుముందు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు లోక్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పంజాగుట్ట పీఎస్‌లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు.
ALSO READ : లోక్ భవన్ ముట్టడి ఉద్రిక్తత.. ఇండియా కూటమి నేతలు అరెస్ట్
సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. పరిస్థితి నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు.