Reading Time: 2 minutes

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు..మాడ వీధుల్లో భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి

Caption of Image.

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.   అక్టోబర్​ 12 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు  పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.   భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ,  ఇతర సౌకర్యాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా ఎస్పీ  ఎల్. సుబ్బరాయుడు,  టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె.వి. మురళీకృష్ణ  క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా తీసుకోవలసిన చర్యలకు  పోలీసు అధికారులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు, టీటీడీ ఇతర  సిబ్బందితో కలిసి శ్రీవారి ఆలయం పరిసరాలు, నాలుగు మాడ వీధులు, భక్తుల గ్యాలరీలు, ఔటర్ రింగ్ రోడ్, అలిపిరి టోల్‌గేట్ తదితర కీలక ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రాకపోకలు, వాహనాల కదలికలు, రద్దీ నియంత్రణ, పార్కింగ్ సామర్థ్యం, భద్రతా పర్యవేక్షణ తదితర అంశాలను పరిశీలించి, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక 

తిరుమలలో అందుబాటులో ఉన్న పరిమిత పార్కింగ్ స్థలాలను దృష్టిలో ఉంచుకుని వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పార్కింగ్ నిర్వహణ చేపట్టాలని సూచించారు. రద్దీకి అనుగుణంగా వాహనాలను క్రమబద్ధీకరించడం, అవసరమైన చోట్ల డైవర్షన్లు, బారికేడింగ్,  భక్తులకు సూచనలు ఇచ్చే మార్గదర్శక సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల నుంచి భక్తుల రవాణాకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సమన్వయంతో పర్యవేక్షించాలని సూచించారు.

మాడ వీధుల్లో భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి

వాహన సేవల సమయంలో నాలుగు మాడ వీధుల్లో భారీగా భక్తులు చేరే అవకాశం ఉన్నందున ఎంట్రీ అండ్​ ఎగ్జిట్​ మార్గాలు, గ్యాలరీలు, బ్యారికేడ్లు, అత్యవసర మార్గాలు స్పష్టంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అధిక రద్దీ ఏర్పడిన సందర్భంలో వెంటనే స్పందించి సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

CCTV, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్‌తో నిరంతర నిఘా

 తిరుమల.. తిరుపతి పరిధిలో ఏర్పాటు చేసిన CCTV వ్యవస్థలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా భక్తుల రద్దీ, వాహనాల కదలికలు, కీలక ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రద్దీ పెరుగుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు చేపట్టేలా పోలీసు, టీటీడీ విజిలెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

అలిపిరి టోల్‌గేట్ వద్ద భద్రత కట్టుదిట్టం

  తిరుమలకు ప్రవేశించే ప్రధాన మార్గమైన అలిపిరి టోల్‌గేట్ దగ్గర వాహనాలు, భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడంతో పాటు భద్రతా తనిఖీలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, భద్రతా తనిఖీల వల్ల భక్తులకు అనవసర ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20 వరకు జరగనున్న నేపథ్యంలో, అక్టోబర్ 16న జరిగే గరుడ వాహన సేవకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆ రోజుకు అనుగుణంగా ప్రత్యేక రద్దీ, ట్రాఫిక్, పార్కింగ్ మరియు భద్రతా ప్రణాళికలను ముందుగానే అమలు చేయాలని అధికారులు సూచించారు.

పోలీసు, టీటీడీ విజిలెన్స్, రవాణా, ఇతర సంబంధిత విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ భక్తుల భద్రత, సౌకర్యం, సజావుగా వాహనాల రాకపోకలు, ప్రశాంత వాతావరణంలో వాహన సేవల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ  ఎల్. సుబ్బరాయుడు,సీవీ అండ్ ఎస్వో  కె.వి. మురళీకృష్ణ  అధికారులకు స్పష్టం చేశారు.భక్తులు పోలీసులు, టీటీడీ సిబ్బంది సూచనలను పాటిస్తూ కేటాయించిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను మాత్రమే వినియోగించాలని, రద్దీ ప్రాంతాల్లో క్రమశిక్షణ పాటించి భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని  విజ్ఞప్తి చేశారు.

ఇటీవల జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశించించారు. ఈసారి దసరా సెలవుల కారణంగా గతంతో పోలిస్తే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రద్దీ నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ  ఐ రామకృష్ణ , డీఎస్పీలు, సిఐలు, టిటిడి విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.