
- రైతు బజార్ లో టమాట రూ.28 బయట మాత్రం రూ.60
- ఉల్లిగడ్డ రూ.40 ఉంటే 80కి అమ్ముతున్నరు
- సూపర్మార్కెట్లు, ఆన్లైన్ లోనూ ఇదే దందా
- ఏది ముట్టుకున్నా రూ.60 నుంచి రూ.100
- సివిల్ సప్లయీస్ సైలెన్స్
రాజధానిలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. రైతు బజార్లలో తక్కువ ధరకే దొరుకుతున్నా..బహిరంగ మార్కెట్లో అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారు. ఏ కూరగాను ముట్టుకున్నా కిలో రూ.60 నుంచి రూ.100కు తక్కువ లేదు. ఇంత ధరెందుకు అని ప్రశ్నిస్తే ‘వర్షాలెక్కడున్నయ్..కూరగాయలొస్తలేవ్..ఈ ధరకు అమ్ముడే ఎక్కువ’ అని అంటున్నారు. జెప్టో, బ్లింకిట్, ఇన్‌స్టా మార్ట్వంటి ఆన్లైన్ స్టోర్లతో పాటు సూపర్మార్కెట్లలోనూ ధరలు అదురుతున్నాయ్. ఇంత పెట్టి కొనలేని చాలామంది పప్పులు, చారుతో అడ్జస్ట్ అవుతున్నారు. తనిఖీలు చేసి ధరలను కంట్రోల్చేయాల్సిన సివిల్సప్లయీస్శాఖ అధికారులు ఎక్కడా కనిపించడం లేదు.
హైదరాబాద్ సిటీ, వెలుగు : బహిరంగ మార్కెట్లో కూరగాయలు కొనే పరిస్థితి కనిపించడం లేదు. రైతు బజార్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉండగా..బయట మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, ఆన్లైన్లో డబుల్రేట్లకు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రెండింతలు తీసుకుంటే మరికొన్ని చోట్ల మూడింతలు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య, దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ఉదాహరణకు నగరంలోని రైతు బజార్లలో టమాటా కిలో రూ.28 నుంచి రూ.31 మధ్య దొరుకుతుండగా, బయట మార్కెట్లలో రూ.60 వరకు అమ్ముతున్నారు. ఉల్లిగడ్డ రైతు బజార్‌లో కిలో రూ.40 ఉంటే..బయట ఏకంగా రూ.70 నుంచి రూ.80 వరకు తీసుకుంటున్నారు. ఇక పచ్చిమిర్చి ధర చూస్తే పరేషాన్కావాల్సిందే..రైతు బజార్‌లో రూ.40 నుంచి రూ.50 వరకు దొరుకుతుండగా.. బయట రూ.100కు తగ్గడం లేదు. రోజువారీ వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే ఈ మూడు రకాల కూరగాయల ధరలు బయటి మార్కెట్లలో అందలేని స్థితిలో ఉండడం, రైతు బజార్లు దూరంగా ఉండడం, అవెక్కడున్నాయో తెలియకపోవడంతో జనాలు నష్టపోతున్నారు.
డిమాండ్‌కు తగ్గట్టే సప్లై
పది చోట్ల రైతు బజార్లు ఉండగా, వీటితో పాటు కాలనీల్లో సంచార రైతు బజార్ల ద్వారా కొంచం ఎక్కువ ధరకు మార్కెటింగ్‌శాఖ కూరగాయలను విక్రయిస్తోంది. ఈ మార్కెట్లకు ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్, చేవెళ్ల, వికారాబాద్, శంకర్‌పల్లి, సిద్దిపేట, గజ్వేల్‌తదితర ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతి అవుతాయి. కొన్ని కూరగాయలు అయితే, కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి కూడా వస్తాయి. అన్నిచోట్లా రోజూ దాదాపు 600 నుంచి 800 టన్నుల కూరగాయలు విక్రయాలు జరుగుతాయి. ప్రస్తుతం డిమాండ్ కి తగినంత కూరగాయలు వస్తున్నాయని, కొరత ఏమీ లేదని అధికారులు చెప్తున్నారు.
ధరల తేడా ఇది…
ఆలుగడ్డ రైతు బజార్‌లో కిలో రూ.14 నుంచి రూ.17 మధ్య ఉంటే..బయట మార్కెట్లో రూ.44 వరకు విక్రయిస్తున్నారు. వంకాయ రైతు బజార్‌లో రూ.25–30 ఉంటే..బయట రూ.64 , బెండకాయ రైతు బజార్‌లో స్థానిక రకం రూ.50–55, హైబ్రిడ్ రకం రూ.25గా ఉండగా.. బయట మార్కెట్లో రూ.80, దొండకాయ రైతు బజార్‌లో రూ.30–35 ..బయట రూ.64, కాకరకాయ రూ.40 నుంచి రూ.80కి పెంచి విక్రయిస్తున్నారు. బీరకాయ రైతు బజార్‌లో కిలో రూ.40 వరకు ఉండగా.. బయట రూ.60 నుంచి రూ.80, క్యారెట్ రైతు బజార్‌లో రూ.35 ఉంటే.. బయట రూ.70 , క్యాబేజీ రైతు బజార్‌లో కిలో రూ.8కే దొరుకుతుండగా, బయట మార్కెట్లో రూ.30కి విక్రయిస్తున్నారు. క్యాలీ ఫ్లవర్రైతు బజార్‌లో రూ.20 ..బయట రూ.42, క్యాప్సికం రూ.45 నుంచి రూ.70, చిక్కుడు రూ.40 ఉంటే..రూ.60 నుంచి 80 వరకు పెంచి అమ్ముతున్నారు.
ఆన్లైన్లో ఇలా..
జెప్టో, బ్లింక్ ఇట్, ఇన్‌స్టా మార్ట్, ఫ్లిప్‌కార్ట్, ఆమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ కూడా కూరగాయల డెలివరీ చేస్తున్నాయి. ఇందులో కూరగాయల ధరలు పిరంగానే ఉనాయి. టమాట కిలో రూ.60 నుంచి రూ., 92, ఉల్లిగడ్డ రూ.70, ఆలుగడ్డ రూ.34, పచ్చిమిర్చి రూ.130, వంకాయ రూ.52 నుంచి రూ.100, బెండకాయ రూ.80, దొండకాయ రూ.96, కాకరకాయ రూ.128, బీరకాయ రూ.72 కు అమ్ముతున్నారు.
తనిఖీలు ఎక్కడ?
కూరగాయలను ఎక్కువకు అమ్ముతున్న స్థానిక వ్యాపారులపై నిఘా పెట్టి ధరలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత సివిల్సప్లయీస్శాఖపై ఉంటుంది. కానీ, ఈ శాఖ అధికారులు ఎక్కడా తనిఖీలు చేసినట్టు కనిపించడం లేదు. రైతు బజార్లలో ధరలు, మార్కెట్‌లోని ధరలను పరిశీలించి వ్యాపారులకు మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉన్నా.. ఆఫీసులకే పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి.
రైతుబజార్లు ఉన్నాయిక్కడ
1) కూకట్‌పల్లి (జేఎన్టీయూ సమీపంలో కేపీహెచ్‌బీ ఫేజ్-1..బుధవారం సెలవు)
2) ఎర్రగడ్డ (ఎర్రగడ్డ మెయిన్ రోడ్డులో, భరత్ నగర్ మెట్రో పిల్లర్ నంబర్ A980కి ఎదురుగా.. శుక్రవారం సెలవు)
3) సరూర్‌నగర్(సరూర్‌నగర్, కొత్తపేట సరిహద్దులోని గాయత్రీ నగర్ రోడ్డులో ) నెలకి ఒకసారి సెలవు
4) మెహదీపట్నం (మెహదీపట్నం బస్ స్టాప్ సమీపంలో..మంగళవారం సెలవు)
5) ఫలక్‌నుమా ( ఫలక్‌నుమా పీఎస్ పక్కన, కిషన్ ప్రసాద్ రోడ్డులో) శుక్రవారం హాలిడే
6) వనస్థలిపురం(కమలానగర్ లోని మెయిన్‌రోడ్డుపై) నెలలో లాస్ట్ బుధవారం హాలీడే
7) అల్వాల్( అల్వాల్ ఫ్లైఓవర్ కింద) హాలిడే లేదు
8) ఎల్లమ్మబండ (కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ ఫేజ్-2 లో ) నెలకి ఒకసారి సెలవు
9) ఆర్కే పురం (నేరెడ్‌మెట్ ఆర్కే పురంలోని సైనిక్ నగర్ ఎదురుగా) హాలీడే లేదు
హోల్ సేల్ మార్కెట్లు (ఉదయం 10 గంటల వరకే..)
1.బోయిన్ పల్లి, 2.గుడి మల్కాపూర్, 3.ఎల్బీనగర్ 4.భరత్ నగర్ ఏఎంసీ కూకట్ పల్లి, 5. మలక్ పేట్, 6. మీరాలంమండి, 7. మాదన్న పేట్
రైతు బజార్లకు వెళ్లేది తక్కువే..
రైతు బజార్లలో కూరగాయల ధరలు అందుబాటులో ఉన్నప్పటికీ..తక్కువ సంఖ్యలో ఉండడంతో చాలామంది ఇంటికి దగ్గర్లోని కూరగాయల దుకాణాలు, కాలనీల్లో షాపులు, సూపర్ మార్కెట్లకు వెళ్తున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌పై ఆధారపడుతున్నారు. డిమాండ్ ఉండడంతో స్థానిక వ్యాపారులు ధరలను భారీగా పెంచి అమ్ముతున్నారు. వారాంతపు సంతల్లో కూడా దోపిడీ ఎక్కువైంది. ఇక్కడ రైతులు కొందరే కాగా, ఎక్కువ మంది దళారులే. దీంతో రేట్లు ఇష్టమున్నంత పెంచుతున్నారు. వీక్లీ మార్కెట్లకు వచ్చిన రైతుల వద్ద తక్కువ ధరకు కొని ఎక్కువకు విక్రయిస్తున్నారు.