Reading Time: < 1 minute
Ap Liquor Shops 92 Licenses Renewed 517 Shops To Be Allotted

AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ పాలసీ కింద మద్యం దుకాణాల పునరుద్ధరణ, కేటాయింపు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలను ప్రభుత్వం నోటిఫై చేయగా.. ఇప్పటికే 2,929 దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణ పూర్తయింది. దీంతో మొత్తం నోటిఫై చేసిన దుకాణాల్లో 92 శాతం దుకాణాల ప్రక్రియ పూర్తయినట్లు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. మరో 517 మద్యం దుకాణాలను అక్టోబర్ 8న లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ 517 దుకాణాల కేటాయింపు పూర్తయితే మొత్తం 3,446 మద్యం దుకాణాల పునరుద్ధరణ లేదా కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.

రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ పాలసీ ప్రకారం ఇప్పటికే కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్సులను పునరుద్ధరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే 2,929 దుకాణాల లైసెన్సులు ఇప్పటికే పునరుద్ధరించబడ్డాయి. అక్టోబర్ 8న 517 దుకాణాల కేటాయింపు పూర్తయిన తర్వాత ఇంకా 290 దుకాణాలు మిగిలి ఉంటాయని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఈ మిగిలిన దుకాణాలకు విడిగా నోటిఫికేషన్ జారీ చేసి, తదుపరి కేటాయింపు ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే పనిచేయని దుకాణాలతో పాటు మిగిలిన దుకాణాలను కలిపి మొత్తం 807 దుకాణాలను లాటరీ విధానంలో కేటాయించేందుకు నోటిఫై చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ దశలవారీగా కొనసాగుతోంది.