Reading Time: < 1 minute
Indigo Flight Struck By Lightning At 17000 Feet 104 Passengers Safe

IndiGo 6E925 Lightning Strike: ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఆకాశంలో పిడుగు తాకింది. సుమారు 17,000 అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటు కారణంగా విమానం ముందు భాగం (నోస్) దెబ్బతిన్నప్పటికీ.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా లక్నో విమానాశ్రయంలో దించారు. విమానంలోని 104 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఇండిగో 6E925 విమానంలో ఘటన

ఈ ఘటన ఇండిగో విమానం 6E925లో చోటుచేసుకుంది. పాట్నా విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3:10 గంటలకు విమానం బయలుదేరింది. సాయంత్రం 4:20 గంటలకు లక్నో చేరుకోవాల్సి ఉండగా.. లక్నో సమీపంలో ప్రతికూల వాతావరణంలో సుమారు 17,000 అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొన్న పైలట్ విమానాన్ని లక్నో విమానాశ్రయానికి తీసుకువచ్చారు. సాయంత్రం సుమారు 4:05 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.

విమానాన్ని గ్రౌండ్ చేసిన అధికారులు

ల్యాండింగ్ అనంతరం పిడుగుపాటు కారణంగా తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిశీలించేందుకు విమానాన్ని లక్నో విమానాశ్రయంలోనే గ్రౌండ్ చేశారు. ఇదే విమానం అనంతరం లక్నో-అహ్మదాబాద్ ఇండిగో 6E6968 విమానంగా నడవాల్సి ఉంది. అయితే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇండిగో సంస్థ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ప్రయాణికులు సాయంత్రం 6:22 గంటల సమయంలో మరో విమానంలో అహ్మదాబాద్‌కు బయలుదేరారు.