Reading Time: 2 minutes

నానా పటేకర్ చివరి మాటలు ఇవే.. ‘మనమందరం ఏదో ఒక రోజు వెళ్లిపోవాల్సిందే’

Caption of Image.

గోవా: బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు CPR చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. ఉదయం 5.20 గంటలకు నానా పటేకర్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

నానా పటేకర్ అక్టోబర్ 4న గోవాలోని డోనా పౌలాలో జరిగిన సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే ఆయన చివరి బహిరంగ కార్యక్రమంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. తెల్లటి కుర్తా, తెల్లటి స్కార్ఫ్ (గమ్ఛా) ధరించి నానా పటేకర్ కార్యక్రమంలో ప్రసంగించారు. 

చివరి ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ కార్యక్రమంలో నానా పటేకర్ మాజీ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను గుర్తుచేసుకున్నారు. ఆయన పనిచేసిన విధానాన్ని, రాజకీయ నాయకుడిగా ఆయన శైలిని ప్రశంసించారు.అనంతరం జీవితం, మరణం గురించి మాట్లాడుతూ నానా పటేకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.“మనమందరం ఏదో ఒక రోజు వెళ్లిపోవాల్సిందే. నేను రేపు ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు.

ప్రతి ఒక్కరి జీవితం ఎప్పటికైనా ఆ దశకు చేరుకుంటుంది. కానీ అది జరగడానికి ముందు.. నేను చేయాలనుకున్నది చేయగలుగుతున్నానా? అని నన్ను నేను ప్రశ్నించుకోవాలి” అని ఆయన మరాఠీలో అన్నారు. ఆ మాటలు ఆయన చివరి బహిరంగ ప్రసంగంలో భాగంగా ఉండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానం

నానా పటేకర్ హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేశారు. విలక్షణ నటన, శక్తివంతమైన సంభాషణలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్‌కమ్’, ‘నటసమ్రాట్’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచాయి.

2013లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ నానా పటేకర్ తన ప్రతిభను చాటుకున్నారు. నానా పటేకర్ ఆకస్మిక మరణంతో బాలీవుడ్, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.