Reading Time: 2 minutes
Kieron Pollard Joins Sa20 Johannesburg Super Kings Leaves Mi Camp

Kieron Pollard Leaves MI Camp and Joins CSK: వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్, టీ20 క్రికెట్ దిగ్గజం కీరన్ పొలార్డ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడిన పొలార్డ్.. ఇప్పుడు దశాబ్దకాలానికి పైగా అనుబంధం ఉన్న ముంబై ఇండియన్స్‌కు ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టబోతున్నాడు. రాబోయే SA20 సీజన్‌లో జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ తరఫున పొలార్డ్ బరిలోకి దిగనున్నాడు. SA20 తదుపరి సీజన్‌కు జరుగుతున్న ప్లేయర్ల వేలంలో జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ పొలార్డ్‌ను రూ.1.5 మిలియన్ రాండ్లకు దక్కించుకుంది. దీంతో ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న పొలార్డ్ తొలిసారి సీఎస్కేకు చెందిన ఫ్రాంచైజీ తరఫున ఆడబోతున్నాడు.

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్‌లో పోటీ తారాస్థాయిలో ఉంటుంది. ఈ రెండు జట్లను లీగ్‌లో ఆర్చ్‌ రైవల్స్‌గా కూడా పిలుస్తారు. అలాంటి ప్రత్యర్థి ఫ్రాంచైజీకి చెందిన జట్టులో పొలార్డ్ చేరడం ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. పొలార్డ్‌కు ముంబై ఇండియన్స్‌తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 2010లో ముంబై ఇండియన్స్‌లో చేరిన అతడు 2022 వరకు అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన 12 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో మరో భారత ఫ్రాంచైజీ తరఫున ఆడకుండా ముంబైకే అంకితమయ్యాడు. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిళ్లు గెలిచిన సమయంలో పొలార్డ్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

ఐపీఎల్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు చెందిన ఫ్రాంచైజీలతోనూ పొలార్డ్ అనుబంధం కొనసాగింది. ILT20లో ఎంఐ ఎమిరేట్స్, మేజర్ లీగ్ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్, SA20లో ఎంఐ కేప్‌టౌన్ జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా SA20లో ఎంఐ కేప్‌టౌన్ తరఫున రెండు సీజన్లు ఆడిన తర్వాత ఇప్పుడు జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్‌లోకి మారుతున్నాడు. SA20లో పొలార్డ్ గత రెండు సీజన్లు పెద్దగా ఆడలేదు. 2025-26 సీజన్‌లో ఎంఐ కేప్‌టౌన్ తరఫున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 20 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్ తీయలేదు. అంతకుముందు 2023-24 సీజన్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 37.40 సగటుతో పరుగులు సాధించాడు. అదే సీజన్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్న పొలార్డ్ తన కెరీర్‌లో చివరి దశలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌లో అతడికి ఉన్న అనుభవం ఎంతో విలువైనది. ముఖ్యంగా యువ ఆటగాళ్లతో కలిసి పనిచేయడం, ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో అనుభవాన్ని ఉపయోగించడం వంటి విషయాల్లో అతడి సేవలు జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌కు చెందిన వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన పొలార్డ్.. ఇప్పుడు తొలిసారి సీఎస్కే కుటుంబంలోని జట్టుతో కలిసి పనిచేయబోతున్నాడు. ముంబై ఇండియన్స్ లెజెండ్‌గా గుర్తింపు పొందిన పొలార్డ్ ప్రత్యర్థి ఫ్రాంచైజీ జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ తరఫున ఎలా రాణిస్తాడన్నది రాబోయే SA20 సీజన్‌లో ఆసక్తికరంగా మారింది.