Reading Time: 2 minutes

కొత్తపల్లి- సిరిసిల్ల రైల్వే లైన్ పనుల్లో కదలిక..రెండు స్టేషన్ల మధ్య 32 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణానికి టెండర్

Caption of Image.
  • రూ.750 కోట్ల అంచనా వ్యయంతో పనులు 
  • రెండేళ్లలో పూర్తి చేసేందుకు కసరత్తు 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి– సిరిసిల్ల స్టేషన్ల మధ్య రైల్వే లైన్ పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రెండు స్టేషన్ల మధ్య 32 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణానికి తాజాగా టెండర్ పిలిచారు. ఈ ప్రక్రియ పూర్తయితే రెండేళ్లలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్‌‌‌‌తో ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను అనుసంధానించాలనే కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ పనులను 2016లో ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ లైన్ పరిధిలో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు ఇప్పటికే రైళ్లు పరుగులు పెడుతుండగా, సిరిసిల్ల వరకు స్టేషన్ నిర్మాణంతో పాటు ట్రాక్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. సిరిసిల్ల నుంచి కొత్తపల్లి మధ్య ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల కేటాయింపులో జరిగిన జాప్యంతో 2025 నాటికే పూర్తికావాల్సిన ఈ పనులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం సిరిసిల్ల నుంచి వేములవాడ వైపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. 

32 కిలోమీటర్లు.. రూ.750 కోట్లు.. 

సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కొత్తపల్లి వరకు ఉన్న 32 కిలోమీటర్ల నూతన సింగిల్ బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణం కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ తాజాగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు రూ.750 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గంలోనే మిడ్ మానేరు నదిపై భారీ రైల్వే బ్రిడ్జి పనులు వేగంగా సాగుతున్నాయి.

తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి నుంచి వేములవాడ మండలం అనుపురం వరకు నదీ గర్భంలో దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న ఈ వంతెన పనులను కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ వేగంగా పూర్తి చేస్తోంది. ఈ పనులన్నీ అనుకున్నట్లు సాగితే 2029 మార్చి నాటికి 151 కిలోమీటర్ల మొత్తం మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తిగా అందుబాటులోకి రానుంది.

పుణ్యక్షేత్రాలను కలిపే లైన్.. 

హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ రైల్వే లైన్ భవిష్యత్తులో ఉత్తర తెలంగాణకు ఒక లైఫ్ లైన్‌‌‌‌గా మారబోతోంది. ఈ లైన్ పూర్తయితే కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు హైదరాబాద్ నుంచి భక్తుల రాకపోకలు సులువవుతాయి. సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులు, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల వ్యవసాయ, పారిశ్రామిక సరుకులను ఇటు హైదరాబాద్‌‌‌‌, అటు మహారాష్ట్రకు రవాణా చేయడం సులభతరం అవుతుంది. అంతేకాకుండా కొండగట్టు పరిసరాల్లో లభ్యమయ్యే విలువైన రేర్ ఎర్త్ మెటల్స్ (ఖనిజాల) తవ్వకాలు ప్రారంభమయ్యే నాటికి, వాటి ఎగుమతులకు ఈ రైలు మార్గమే అత్యంత కీలకమైన రవాణా వనరుగా మారనుంది. 

©️ VIL Media Pvt Ltd.