Reading Time: < 1 minute
Ambati Rambabu On Local Body Election Certificates And Nominations

Ambati Rambabu: స్థానిక సంస్థ ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. నామినేషన్ దాఖలు సమయంలో అవసరమైన సర్టిఫికెట్లు సమర్పించకపోతే నామినేషన్లు ఆమోదం పొందవని తెలిపిన ఆయన.. అయితే, తమ పార్టీ అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషన్ స్థాయిలోనే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే అధికారులు తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. తహసీల్దార్లకు ఫోన్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వొద్దని సూచించే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని కలెక్టర్‌ను కోరామని, చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషన్లు తిరస్కరిస్తే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత గణనీయంగా పెరిగిందని, వైసీపీకి ప్రజాదరణ పెరుగుతోందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిజాయితీగా జరిగితే చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, తాడేపల్లిలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి తమ ప్రభుత్వ హయాంలో రెండు ఎకరాల భూమి కేటాయించామని అంబటి తెలిపారు. భవనం నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కోర్టు నోటీసులు ఇవ్వాలని చెప్పినా ఆదేశాలను పట్టించుకోలేదని విమర్శించారు.

స్థలాన్ని స్మశాన వాటిక కోసం వెనక్కి తీసుకుంటామని తహసీల్దార్ నోటీసు ఇచ్చారని అంబటి తెలిపారు. చంద్రబాబు ఇంటికి అనుమతులు లేవని, అయితే ఆయన కోర్టును ఆశ్రయించి ఇంటి కూల్చివేతను అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యాలయ భూమి, సర్టిఫికెట్ల అంశాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు..