Reading Time: 2 minutes

భారత్‌తో సిరీస్‌కి  ముందు న్యూజిలాండ్ మాస్టర్ ప్లాన్.. కివీస్ బ్యాటింగ్ కోచ్‌గా మాజీ స్టార్ క్రికెటర్! 

Caption of Image.

IND vs NZ: సొంతగడ్డపై భారత జట్టుతో జరగనున్న మల్టీఫార్మాట్ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) తమ కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ బీజే వాట్లింగ్ (BJ Watling)‌ను కివీస్ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న ల్యూక్ రోంచి స్థానంలో వాట్లింగ్ ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. 

నవంబర్ 16 నుంచే బాధ్యతలు.. ఆసీస్ టూర్‌కు ఫుల్ ఛార్జ్: 

ప్రస్తుతం నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ మెన్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న బీజే వాట్లింగ్.. 2026, నవంబర్ 16వ తేదీన న్యూజిలాండ్ సపోర్ట్ స్టాఫ్‌తో కలవనున్నారు. ప్రస్తుత కోచ్ ల్యూక్ రోంచితో కలిసి కొంతకాలం ట్రాన్సిషన్ (మార్పుల) కాలంలో పని చేస్తారు. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న తరుణంలో.. వాట్లింగ్ ఈ బాధ్యతలను అధికారికంగా, పూర్తిగా తన చేతులోకి తీసుకుంటారు. ఆటగాడిగా వాట్లింగ్ తన కెరీర్‌లో న్యూజిలాండ్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, డర్హమ్ తరఫున మొత్తం 178 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 10,000+ పరుగులు సాధించారు. ఇందులో 18 సెంచరీలు ఉండటం విశేషం.

కొత్త బాధ్యతలపై బీజే వాట్లింగ్ స్పందన: 

ఈ నియామకంపై బీజే వాట్లింగ్ మాట్లాడుతూ.. తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ జట్టులోకి తిరిగి వచ్చి ప్రస్తుత ఆటగాళ్లతో కలిసి పని చేయడం నాకు దక్కిన ప్రత్యేకమైన అవకాశం.. దీనిని నేను తేలికగా తీసుకోవడం లేదు.. గత కొద్ది సంవత్సరాలలో ఈ జట్టు, సపోర్ట్ స్టాఫ్ సాధించిన విజయాలు అద్భుతం.. ప్రపంచ స్థాయి జట్టులో భాగం కావడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నాడు.

బీజే వాట్లింగ్ నియామకాన్ని సమర్థించిన ఎన్‌జెడ్‌సీ: 

న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ హై-పెర్ఫార్మెన్స్ ఆఫీసర్ డారిల్ గిబ్సన్ (Daryl Gibson) వాట్లింగ్ నియామకంపై మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. వెల్లింగ్టన్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్లతో కోచ్‌గా బీజే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ప్రస్తుత జట్టులోని చాలా మందితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆధునిక బ్లాక్‌క్యాప్స్ (BLACKCAPS) ఆటగాళ్లలో అత్యంత గౌరవనీయుడైన వ్యక్తి ఆయన. కివీస్ క్రికెట్ గుర్తింపుకు వాట్లింగ్ ప్రయాణం అద్దం పడుతుందని గిబ్సన్ కొనియాడారు. రాబోయే కొద్ది నెలలు న్యూజిలాండ్ క్రికెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని వెల్లడించారు. 

©️ VIL Media Pvt Ltd.