
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తుల వివరాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వందల కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించిన వ్యక్తి, కేవలం కొన్ని ఆస్తుల వివరాలు నమోదు కానంత మాత్రాన ఉద్దేశపూర్వకంగానే దాచారని లేదా అవినీతికి పాల్పడ్డారని భావించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో విజయ్ తన ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదని ఆరోపిస్తూ పిటిషనర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు రూ. 30 కోట్ల విలువైన ఆస్తుల వివరాలను ఉద్దేశపూర్వకంగానే అఫిడవిట్‌లో పొందుపరచలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించకపోవడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, కాబట్టి విజయ్ ఎన్నికను రద్దు చేసి అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు.
అయితే పిటిషనర్ లేవనెత్తిన ఆరోపణలపై విజయ్ తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. ఎన్నికల అఫిడవిట్ తయారు చేసే క్రమంలో ఆడిటర్ చేసిన పొరపాటు వల్లనే కొన్ని ఆస్తుల వివరాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఇందులో విజయ్ ప్రమేయం గానీ, ఆస్తులను ఉద్దేశపూర్వకంగా దాచాలనే దురుద్దేశం గానీ లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఇరుపక్షాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ఈ వ్యవహారంలో కీలక పరిశీలన చేసింది. విజయ్ ఇప్పటికే దాదాపు రూ. 600 కోట్ల విలువైన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పారదర్శకంగా వెల్లడించారని న్యాయస్థానం గుర్తుచేసింది. అంత భారీ మొత్తంలో ఆస్తులను ప్రకటించిన వ్యక్తి, మరో రూ. 30 కోట్ల విలువైన ఆస్తులను కావాలనే దాచారని అనుకోవడానికి ఆస్కారం లేదని పేర్కొంది. కేవలం రూ. 30 కోట్ల ఆస్తుల వివరాలు నమోదు కాకపోతే దానిని నేరుగా అవినీతిగా ఎలా పరిగణిస్తామని ప్రశ్నించింది.
ఆడిటర్ చేసిన పొరపాటును విజయ్ ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుగా పరిగణించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. పైగా ఆయన ఒక పెద్ద స్టార్ హీరో కావడంతో, తనకు సంబంధించిన ప్రతి ఆస్తి వివరాలు వ్యక్తిగతంగా ఆయనకు క్షుణ్ణంగా తెలిసి ఉండకపోవచ్చని పేర్కొంటూ.. ఈ ఒక్క కారణంతో ఆయనను పదవికి అనర్హుడిగా ప్రకటించలేమని స్పష్టం చేసింది.