Reading Time: < 1 minute
Fake Dap Fertilizer Scam In Telangana Government Orders Probe As Police Intensify Investigation

Fake DAP Fertilizer Scam: తెలంగాణలో నకిలీ డీఏపీ (DAP) ఎరువుల వ్యవహారం కలకలం రేపుతోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఎరువులను విక్రయిస్తున్న ముఠాపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) అధికారులను ఆదేశించారు. మరోవైపు నకిలీ ఎరువుల తయారీ, సరఫరా వెనుక ఉన్న ముఠాను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక విచారణలో ఈ నకిలీ డీఏపీ ఎరువులు కర్ణాటకలో తయారైనట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వాటిని తెలంగాణలోని పలు జిల్లాలకు తరలించి విక్రయించినట్లు అనుమానిస్తున్నారు. రైతులకు ఎలాంటి అనుమానం రాకుండా అసలైన డీఏపీ బస్తాలను పోలి ఉండేలా తయారు చేయడమే కాకుండా, వాటిపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను కూడా ముద్రించినట్లు అధికారులు వెల్లడించారు.

వికారాబాద్ జిల్లా విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్‌పల్లిలో 106 నకిలీ డీఏపీ బస్తాలు గుర్తించారు. అలాగే పరిగి మండలం చిగురాల్‌పల్లిలో 25 మంది రైతులు మొత్తం 275 నకిలీ డీఏపీ బస్తాలు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.

కొంతమంది రైతులు ఇప్పటికే ఈ నకిలీ ఎరువులను తమ పొలాల్లో ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. మంచన్‌పల్లిలో లభ్యమైన 106 బస్తాలు, చిగురాల్‌పల్లిలో గుర్తించిన 27 బస్తాలను స్వాధీనం చేసుకుని చన్గోముల్, పరిగి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతులు కొనుగోలు చేసిన నకిలీ డీఏపీపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల విచారణలో నకిలీ ఎరువుల ముఠా కొంతమంది సర్పంచ్‌లను అడ్డం పెట్టుకుని ఈ దందా నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు నకిలీ డీఏపీ ఎరువులను పొలాల్లో చల్లిన రైతుల చేతులకు బొబ్బలు వచ్చినట్లు సమాచారం.