Reading Time: < 1 minute
Hanuma Vihari Questions Bcci Selection Different Rules For Abhishek Sharma And Sanju Samson

Hanuma Vihari Questions BCCI Selection: భారత జట్టు ఎంపిక విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు హనుమ విహారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మకు జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అవకాశాలు ఇవ్వడంపై మండిపడ్డాడు. టీ20 ప్రపంచ కప్‌ 2026లో అద్భుతంగా రాణించిన సంజు శాంసన్‌కు మాత్రం ఎందుకు సరైన అవకాశాలు ఇవ్వలేదని ప్రశ్నించాడు. 2-3 మ్యాచ్‌లలో విఫమైన సంజును జట్టు నుంచి తీసేశారని.. అభిషేక్‌ను మాత్రం కొనసాగిస్తున్నారని మండిపడ్డాడు. అభిషేక్‌కు ఓ రూల్.. సంజుకు మరో రూలా? అంటూ ఫైర్ అయ్యాడు.

హనుమ విహారి తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘ప్రపంచ కప్‌కు ముందు సంజు శాంసన్ ఐదు మ్యాచ్‌ల్లో రాణించకపోవడంతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి అవకాశం వచ్చిన తర్వాత ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ ప్రదర్శనను పరిశీలిస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో ఒక అర్ధశతకం మినహా అభిషేక్ బ్యాట్ నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. 20 లేదా 30 పరుగుల ఇన్నింగ్స్ కూడా లేవు. చివరి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం మాత్రమే చేశాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌లను కలుపుకుంటే చివరి 18 ఇన్నింగ్స్‌లో కేవలం మూడు అర్ధ శతకాలే ఉన్నాయి’ అని వివరించాడు.

‘సంజు శాంసన్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా అర్ధ శతకాలు సాధించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంతో అతడు మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌కు దూరమయ్యాడు. సంజూను ఇన్‌కన్సిస్టెంట్ అంటారు. అది సరే కానీ ఒత్తిడి పరిస్థితుల్లో మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సామర్థ్యం అతనికి ఉంది. అభిషేక్ శర్మ చుట్టూ భారీ హైప్ ఉంది. కానీ సంజు కూడా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. ఇద్దరు ఆటగాళ్ల విషయంలో ఎందుకు వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారు?’ అంటూ హనుమ విహారి బీసీసీఐ సెలెక్టర్లను ప్రశ్నించాడు. విహారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.