Reading Time: < 1 minute
Supreme Court Rejects Review Plea On Sc Status After Religious Conversion Reiterates Verdict

SC Status: మత మార్పిడికి సంబంధించి షెడ్యూల్డ్ కులాల (SC) హోదాపై సుప్రీంకోర్టు మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు ఎస్సీ హోదాను కొనసాగించలేరని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ అంశంపై మార్చి 2026లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.

కోర్టు స్పష్టం చేసిన ప్రకారం.. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదు. ఈ విషయంలో ఇప్పటికే ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు అవసరం లేదని పేర్కొంటూ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, క్రైస్తవం లేదా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తి తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే.. కొన్ని నిర్దిష్ట షరతుల మేరకు ఎస్సీ హోదా పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా ఎస్సీ హోదా పునరుద్ధరణకు మూడు కీలక షరతులు తప్పనిసరిగా నెరవేరాలని ధర్మాసనం పేర్కొంది. అవేంటంటే..

* వ్యక్తి జన్మతః షెడ్యూల్డ్ కులానికి చెందినవారై ఉండాలి.
* తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని నిజమైన ఉద్దేశంతో స్వీకరించి ఉండాలి.
* సంబంధిత అసలు కులం ఆ వ్యక్తిని తిరిగి తమ సభ్యుడిగా అంగీకరించి ఉండాలి.

ఈ మూడు షరతుల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎస్సీ హోదాను పునరుద్ధరించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా మార్చి 2026లో వెలువరించిన తీర్పు యథాతథంగా అమల్లో కొనసాగుతుందని స్పష్టం చేసింది.