July 16, 2026

మ్యాచ్ ఓడిపోతే కొట్టేస్తావా బ్రో..! గ్రౌండ్‎లోనే అర్జెంటీనా ప్లేయర్‎పై ఇంగ్లాండ్ ఆటగాడు దాడి

మ్యాచ్ ఓడిపోతే కొట్టేస్తావా బ్రో..! గ్రౌండ్‎లోనే అర్జెంటీనా ప్లేయర్‎పై ఇంగ్లాండ్ ఆటగాడు దాడి
Reading Time: 2 minutes

మ్యాచ్ ఓడిపోతే కొట్టేస్తావా బ్రో..! గ్రౌండ్‎లోనే అర్జెంటీనా ప్లేయర్‎పై ఇంగ్లాండ్ ఆటగాడు దాడి

Caption of Image.

అట్లాంటా: ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. గెలుపును ఎంత సంతోషంగా స్వీకరిస్తామో.. ఓటమిని కూడా అదే స్ఫూర్తితో అంగీకరించాలి. అంతేకానీ ఓడిపోయామనే బాధలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై కోపం ప్రదర్శించడం, దాడి చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. తాజాగా ఇంగ్లాండ్, అర్జెంటీనా మధ్య జరిగిన ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఇలాంటి తరహా ఘటనే జరిగింది. ఓటమి బాధలో అర్జెంటీనా ఆటగాడిపై గ్రౌండ్‎లోనే దాడి చేశాడు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జూడ్ బెల్లింగ్‌హామ్. 

అసలేం జరిగిందంటే..? 

ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా అట్లాంటా స్టేడియం వేదికగా ఉత్కంఠభరింతంగా సాగిన సెమీ-ఫైనల్‌లో 2-1 తేడాతో తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‎ను చిత్తు చేసింది అర్జెంటీనా. గేమ్ చివరి ఏడు నిమిషాల్లో ఎంజో ఫెర్నాండెజ్, లౌటారో మార్టినెజ్ రెండు సూపర్ గోల్స్ చేసి అర్జెంటీనాకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. తద్వారా ఫిఫా వరల్డ్ కప్‎లో వరుసగా రెండోసారి అర్జెంటీనా ఫైనల్‎కు చేరుకోగా.. ఈ ఓటమితో ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్ర్రమించింది. 

ఇక్కడి వరకు బాగానే ఉన్న మ్యాచ్ అనంతరం గ్రౌండ్‎లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం అర్జెంటీనా రిజర్వ్ బెంచ్ ఆటగాడు వాలెంటిన్ బార్కో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి ఇంగ్లండ్ ఆటగాళ్ల ముందే విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెల్లింగ్‌హామ్‎ను బార్కో ఏదో అన్నాడు. 

అప్పటికే ఓటమి బాధలో ఉన్న బెల్లింగ్‌హామ్ తీవ్ర ఆగ్రహానికి గురై బార్కో తలపై గట్టిగా కొట్టాడు. వెంటనే తేరుకున్న బార్కో బెల్లింగ్‌హామ్‌ను వెనక్కి నెట్టేశాడు. ఈ ఘటనతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొంది. 

వెంటనే రంగంలోకి దిగిన మ్యాచ్ అఫిషియల్స్ ఆటగాళ్లకు సర్దిచెప్పి గొడవను కంట్రోల్ చేశారు. బార్కోపై బెల్లింగ్‌హామ్‌ దాడి చేసిన ఘటన నెట్టింట వైరల్‎గా మారగా.. అతడి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ఓడిపోతే కొట్టేస్తావా బ్రో అని కొందరు ఎద్దేవా చేస్తుండగా.. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమని.. ఓటమి బాధలో ప్రత్యర్థి ఆటగాళ్లపై చేయి చేసుకోవడం కరెక్ట్ కాదని మరికొందరు చురకలంటిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.