
Pakistan: సౌదీ అరేబియా హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో భయపడుతోంది. ఈ నేపథ్యంలో యెమెన్‌లోని హౌతీలపై దాడులు చేయాలని పలు దేశాలను సౌదీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు, సౌదీ-పాక్-టర్కీల ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ రక్షణ ఒప్పందంలో భాగంగా సౌదీ రక్షణకు ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోలేదు. అయినప్పటికీ, ప్రకటనలతో పాకిస్తాన్ సౌదీకి హామీ ఇస్తోంది.
ఇస్లామిక్ పవిత్ర ప్రాంతాలైన మక్కా, మదీనా అలాగే సౌదీ అరేబియా భద్రత కోసం ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’ అని పాకిస్తాన్ ప్రకటించింది. హౌతీ దళాల నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీకి దౌత్యపరంగానే కాకుండా భౌతికంగా కూడా మద్దతు ఇస్తామని ఆ దేశ సైనిక ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి అన్నారు. సౌదీ అరేబియా రక్షణకు కట్టుబడి ఉంటామని చెప్పారు. సౌదీ రక్షణ కోసం ఎందాకైనా వెళ్తామని పేర్కొన్నారు.
ఇటీవల, మక్కాపై హౌతీల డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టినట్లు సౌదీ చెప్పింది. దీని తర్వాత పాకిస్తాన్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇదిలా ఉంటే, తాము ఇస్లామిక్ పవిత్ర స్థలాలను లక్ష్యంగా చేసుకోలేదని, తమ దాడులు సౌదీ రక్షణ సదుపాయాలపైనే అని హౌతీల ప్రతినిధి యహ్యా సరీ అన్నారు. మక్కాపై దాడులు చేయలేదని చెప్పుకొచ్చారు.