పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్!

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దంటూ ప్రజలకు నీతులు చెప్పే పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని ఈ ఘటన నిరూపించింది. హడావిడిగా రాకపోకలు సాగించే పీక్ అవర్స్‌లో, ఆరున్నరేళ్ల వయసున్న తన మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఒక ఎస్సైపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా, ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నార్సింగి ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైగా పనిచేస్తున్న పూజారి తిరుపతి, శనివారం సాయంత్రం నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని గంధంగూడ రోడ్డులో తన మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పించారు. రద్దీగా ఉండే ఆ రోడ్డుపై చిన్నపిల్ల కారు నడపడం చూసి షాక్‌కు గురైన స్థానికులు, వాహనదారులు కారును అడ్డుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ఎస్సైని నిలదీశారు. అయితే, సదరు ఎస్సై తన తప్పును ఒప్పుకోకుండా.. కారు ఆటోమేటిక్ వెహికల్ అని, బ్రేక్ కంట్రోల్ అంతా తన చేతిలోనే ఉంటుందని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతలోనే ఆ చిన్నారి కూడా.. తన తాత ఎస్సై అంటూ స్థానికులతో మాట్లాడసాగింది. ఈ వాగ్వాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు స్థానికులు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సదరు ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవాణాశాఖ సదరు ఎస్సై వాహన రిజిస్ట్రేషన్‌ను ఏడాదిపాటు రద్దు చేసింది. అంతేకాదు ఈ ఘటన నేపథ్యంలో, 18 సంవత్సరాల లోపు వయస్సు గల వారికి వాహనాలు నడపడానికి ఇవ్వవద్దని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ… తల్లిదండ్రులు, సంరక్షకులకు హెచ్చరికలు జారీ చేసింది. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరంగా తీవ్రమైన దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: అభిమానికి విజయ్ దేవరకొండ అభయం!
ఈఎంటీ సాహసం.. అంబులెన్స్‌లోనే ప్రసవం.. తర్వాత!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్‌లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి!