Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!

ఎవరైనా రైలు ప్రయాణం చేస్తున్నారంటే అన్ని ఏర్పాట్లు చేసుకుని జర్నీ చేస్తుంటారు. ఏసీ కోచ్‌ల్లో అయితే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెడ్‌షీట్లు, దుప్పట్లను రైల్వేశాఖ ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా ప్రయాణ సమయంలో ఉపయోగించుకుని.. అక్కడే వదిలేసి వెళ్లిపోతుంటారు. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం అదే అదునుగా బ్యాగుల్లో సర్దుకుని వెళ్లిపోతున్నారు. సహజంగా ఏసీ కోచ్‌ల్లో డబ్బున్న వారే ప్రయాణం చేస్తుంటారు. అలాంటిది మరీ చీఫ్‌గా దుప్పట్లు దొంగతనం చేయడం ఏంటో అర్థం కావడం లేదు. ప్రయాణికులు చోరీ చేస్తుంటే.. కోచ్ అటెండెంట్ జీతాలకు మాత్రం చిల్లు పడుతుంది. తాజాగా ఓ అటెండెంట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
రైళ్లలో ప్రయాణికుల కోసం అందించే బెడ్‌షీట్లు, దుప్పట్లు, దిండు కవర్లు వంటి లినెన్ సామగ్రి భారీగా చోరీకి గురవుతున్న నేపథ్యంలో ఓ లినెన్ అటెండెంట్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రతి బెడ్‌షీట్ దొంగిలించబడినప్పుడు తన జీతం నుంచి రూ.300 కోత విధిస్తున్నారని, కొన్ని నెలల్లో రూ.3,000 నుంచి రూ.4,000 వరకు జీతం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. 2022 జనవరి నుంచి 2026 మే వరకు దేశవ్యాప్తంగా ఏసీ కోచ్‌లలోని లినెన్ సామగ్రిలో కనీసం 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు మాయమైనట్లు వెల్లడైంది. వీటిలో బెడ్‌షీట్లు, దుప్పట్లు, దిండు కవర్లు, తువ్వాళ్లు వంటి వస్తువులు ఉన్నాయి. ప్రయాణికులు వాటిని వెంట తీసుకెళ్లడం వల్ల రైల్వేలకు భారీ నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు.
ఈ పరిస్థితిపై స్పందించిన ఓ లినెన్ అటెండెంట్.. ప్రయాణికులు బెడ్‌షీట్లు తీసుకెళ్లినా తాము ఏమి చేయలేమని, కానీ ఆ నష్టానికి తమనే బాధ్యులను చేస్తున్నారని వాపోయారు. ఒక్కో బెడ్‌షీట్ కనిపించకపోతే తన జీతం నుంచి రూ.300 కోత పడుతోందని, నెలకు వేల రూపాయలు జీతం తగ్గిపోతుండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అయితే ఈ అంశంపై రైల్వే శాఖ భిన్నంగా స్పందించింది. లినెన్ సరఫరా, నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీలదే బాధ్యత అని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. లినెన్ సామగ్రిలో లోటు ఏర్పడితే సంబంధిత ఏజెన్సీల బిల్లుల నుంచే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. రైళ్లలో లినెన్ సామగ్రి చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా ఆస్తిని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు.