
హైదరాబాద్: సైఫాబాద్ పీఎస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్లపై దాడి జరిగిందన్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. కేటీఆర్ పీఆర్వో, పీఏపై ఎలాంటి దాడి జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పీఏ, పీఆర్వోపై దాడి జరిగిందన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. అసెంబ్లీ దగ్గర వివాదం కేసు విచారణలో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 14) వారిని పోలీస్ స్టేషన్కు పిలిచామని తెలిపారు.
ఇదిలా ఉండగా.. స్థానికంగా ఉండే కొంతమంది యువకులు గణేష్ మండపం దగ్గర డీజే పర్మిషన్ కోసం సాయంత్రం పీఎస్కు వచ్చారు. డీజేకు అనుమతి ఇవ్వమని సైఫాబాద్ సీఐ వారికి దురుసుగా సమాధానం ఇచ్చాడు. ఇంతలో ఆ యువకుల్లో ఒకరు కేటీఆర్ పీఆర్వోను గుర్తించి అసెంబ్లీ వద్ద న్యూ సెన్స్ చేసిన వాళ్లని మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అలా మాట్లాడొద్దని సీఐ వారించడంతో యువకులు స్టేషన్ నుంచి వెళ్లిపోయారని క్లారిటీ ఇచ్చారు. పీఎస్లో సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా.. వారిపై ఎలాంటి దాడి జరగలేదని డీసీపీ వివరణ ఇచ్చారు.
సైఫాబాద్ పీఎస్లో కేటీఆర్ పీఏ, పీఆర్వోపై గుర్తు తెలియని దుండగులు మాస్కులు ధరించి వచ్చి దాడి చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఘటన వెనక సీఎం రేవంత్ హస్తం ఉందని కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున పీఎస్కు చేరుకుని ఆందోళనకు దిగారు. స్టేషన్ సీసీ ఫుటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సైఫాబాద్ పీఎస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ పీఏ, పీఆర్వోపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.