కావలసిన పదార్థాలు: 1 కప్పు బాస్మతి బియ్యం లేదా సాధారణ బియ్యం, అర కప్పు పచ్చిశనగపప్పు, పన్నీర్ ముక్కలు 100 గ్రాముల, అర కప్పు సోయా చంక్స్ , సరిపడా క్యారెట్, బంగాళదుంప ముక్కలు, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు, 3 పచ్చిమిర్చి, 2 – సన్నగా తరిగిన టమోటాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తరుగు, బిర్యానీ దినుసులు -బిర్యానీ ఆకు, యాలకులు 2, లవంగాలు 3, అనాసపువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు 10, జాపత్రి, 4 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరియు 3 కప్పుల నీళ్లు
తయారీ విధానం: ఒక గిన్నెలో ఒక కప్పు బాస్మతి బియ్యం, అర కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. అడుగు మందపాటి గిన్నెలో రెండు చెంచాల నూనె వేసి మీడియం సైజులో కోసిన పన్నీర్ ముక్కలను వేసి పచ్చిదనం పోయేలా లేతగా వేయించి పక్కన ఉంచాలి.
అదే గిన్నెలో మరో రెండు స్పూన్ల నూనె వేడిచేసి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క, మిరియాలు, జాపత్రి వేసి లో ఫ్లేమ్‌లో మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఆపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. ఇందులోనే క్యారెట్, బంగాళదుంప ముక్కలు, వేడినీళ్లలో నానబెట్టి గట్టిగా పిండిన సోయా చంక్స్ వేసి నిమిషం పాటు వేయించాలి.
తగినంత ఉప్పు, పసుపు, సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి టమోటా మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు బియ్యం, పప్పు కలిపి ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కాబట్టి కొలత ప్రకారం 3 కప్పుల వేడి నీళ్లను పోయాలి. ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం, శనగపప్పును నీళ్లు వడకట్టి వేయాలి. అలాగే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి కలపాలి. మూతపెట్టి మీడియం మంటపై 3 నిమిషాలు ఉడికించాలి. ఎసరు కాస్త ఇగిరి దగ్గరపడుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి మార్చి నీరంతా పూర్తిగా ఆవిరయ్యే వరకు దమ్ చేయాలి.
అన్నం చక్కగా ఉడికిన తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, అన్నం విరిగిపోకుండా కింద నుంచి పైకి ఒకసారి నెమ్మదిగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు మూతపెట్టి వదిలేయాలి. అంతే, అన్నం పొడిపొడిగా, ముద్దకట్టకుండా వచ్చే హై-ప్రోటీన్ శనగపప్పు పన్నీర్ రైస్ సిద్ధం! వేడివేడి రైతా లేదా పెరుగు పచ్చడితో తిన్నా.. వట్టిగానే తిన్నా అద్భుతమైన రుచినిస్తుంది.




