Reading Time: < 1 minute

గణపతి నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు.. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి మండపానికి  జియో ట్యాగింగ్

Caption of Image.

ఆదిలాబాద్ జిల్లా: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక భద్రతా కార్యాచరణ రూపొందించారు. పట్టణ ప్రాంతాన్ని 4 క్లస్టర్లు, 11 సెక్టార్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ప్రతి క్లస్టర్‌కు సీఐ స్థాయి అధికారిని, ప్రతి సెక్టార్‌కు ఎస్ఐ స్థాయి అధికారిని నియమించారు.

ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 400 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఫుట్ పెట్రోలింగ్ ద్వారా పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు.  జిల్లా వ్యాప్తంగా 1,200కు పైగా గణపతి విగ్రహాల ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో ప్రతి గణపతి మండపానికి జియో ట్యాగింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించనున్నారు.

►ALSO READ | తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని గణనాథుడిని కోరుకున్న: మంత్రి వివేక్

గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం పోలీసు వ్యవస్థ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు. గణపతి మండపాల కమిటీ సభ్యులు పోలీసులు సూచించిన నిబంధనలు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. 

ప్రజలందరూ పరస్పర సహకారంతో, సంయమనంతో వ్యవహరిస్తూ గణపతి నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. బందోబస్తు, గస్తీ, నిఘా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు ఎస్పీ అఖిల్ మహాజన్ దిశానిర్దేశం చేశారు.

©️ VIL Media Pvt Ltd.