Reading Time: < 1 minute
గోల్డ్ మెడల్ నాడ్రీమ్.. ఆ తర్వాతే రిటైర్మెంట్.. స్టార్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Steve Smith Retirement: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ స్మిత్ (Steve Smith) టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై చేసిన సరికొత్త వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 37 ఏళ్ల వయసున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్, సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎక్కువ కాలం కొనసాగే అంశంపై సందిగ్ధత వ్యక్తం చేశారు. రాబోయే యాషెస్ (Ashes) సిరీస్ నాటికి తాను జట్టులో ఉంటానో లేదో ఇప్పుడే చెప్పలేనని, ప్రస్తుతం ప్రతీ సిరీస్‌ను విడివిడిగా పరిగణిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ పత్రిక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 125 టెస్టులాడి 37 సెంచరీలతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న స్మిత్.. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజయం సాధించాలనే కోరిక ఉన్నప్పటికీ, అది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. టెస్టుల్లో రిటైర్మెంట్‌కు కచ్చితమైన తేదీ నిర్ణయించకపోయినా, రానున్న రోజుల్లో పొట్టి ఫార్మాట్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (European T20 Premier League – ETPL) లో ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ (Amsterdam Flames) జట్టు తరఫున ఆడుతున్న స్మిత్, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ (2028 Los Angeles Olympics) లో పాల్గొనడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ క్రీడల కోసమే అధికంగా టీ20 క్రికెట్ ఆడుతున్నట్లు వివరించారు.

గడిచిన 15 ఏళ్ల ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, ఆటను ఇప్పటికీ ఆస్వాదిస్తున్నానని ఆయన చెప్పారు. అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా (South Africa) పర్యటనకు వెళ్లనున్న ఆసీస్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. 2018 బాల్ టాంపరింగ్ వివాదం తలెత్తిన తరువాత స్మిత్ అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..