
హైదరాబాద్: వినాయక చవితి వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. వెంటాడి వేట కొడవళ్లు, కత్తులతో నరికి చంపారు. దుండగులు వెంటపడడంతో హత్యకు గురైన వ్యక్తి బండ్లగూడలోని సుప్రీమ్ వైన్స్‌లోకి వెళ్లగా అక్కడే కత్తులతో నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు దుండగులు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దుండగులు కారులో వచ్చినట్లు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరు..? హత్య చేసింది ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది. సినిమా తరహాలో జరిగిన ఈ మర్డర్‌తో స్థానికులు ఉలిక్కిపడ్డారు.