Reading Time: 2 minutes
Marco Rubio Russia Ukraine War Hormuz Strait Global Crisis Comments

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ యుద్ధం ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ కాలం కొనసాగింది. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధాన్ని ముగించేందుకు సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ స్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతోందని.. దీర్ఘకాలిక సంక్షోభానికి త్వరిత పరిష్కారం అవసరమని అభిప్రాయపడ్డారు. శాంతి చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాలకు అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని రూబియో స్పష్టం చేశారు.

అలాగే “సముద్ర జలసంధులు ఎప్పటికీ తెరిచి ఉండాలి. అక్కడ జరుగుతున్నది భయంకరమైనదే కాకుండా పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది ప్రపంచానికి అస్థిరతను తెస్తోంది.. అసలు అంగీకరించలేని పరిస్థితి” అని హార్ముజ్ గురించి పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలకు కీలకమైన సముద్ర మార్గాల్లో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సముద్ర రవాణా అంతరాయం లేకుండా కొనసాగాలని, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

నాలుగు రోజుల పర్యటన కోసం మార్కో రూబియో గత శనివారం భారత్‌కు వచ్చారు. శనివారం కోల్‌కతాలో అడుగుపెట్టిన ఆయన ఛారిటీ ఆఫ్ మిసనరీష్‌ను సందర్శించారు. అనంతరం ఢిల్లీ చేరుకుని ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. అనంతరం రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. ఇక ఆదివారం జైశంకర్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుకున్నారు. ఇక సోమవారం తాజ్‌మహల్, జైపూర్ ప్రాంతాలను సందర్శించారు. ఇక మంగళవారం క్వాడ్ విదేశాంగ దేశాల సమావేశంలో పాల్గొన్నారు.