Reading Time: 2 minutes
Xiaomi Mijia Air Conditioner Giant Power Saver 2026 Price Features Cooling

Xiaomi Mijia: ఎండలు మండిపోతున్నాయి. బయట ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతుండగా, ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్లపై ఆధారపడే వాళ్ళ సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే ఏసీ కొనడం ఒక సమస్య అయితే, దాన్ని నడిపించిన తర్వాత వచ్చే భారీ కరెంట్ బిల్లులు మరో పెద్ద టెన్షన్‌గా మారుతున్నాయి. ఇప్పుడు అదే సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ చైనా టెక్ దిగ్గజం Xiaomi మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త ఏసీ టెక్ ప్రపంచంలో ఆసక్తి రేపుతోంది. “మిజియా ఎయిర్ కండిషనర్ జెయింట్ పవర్ సేవర్ 2026” పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఏసీ, కేవలం మూడు నిమిషాల్లో గదిని చల్లబరచడమే కాదు, ఏడాదికి గణనీయమైన స్థాయిలో విద్యుత్‌ను కూడా ఆదా చేస్తుందని కంపెనీ ప్రకటించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ హోమ్ డివైస్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఏసీల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు వేగంగా వస్తున్నాయి. అదే దిశగా షియోమి రూపొందించిన ఈ కొత్త మోడల్ వినియోగదారుల అలవాట్లను అర్థం చేసుకుని తన పని తీరును మార్చుకునే సామర్థ్యంతో వస్తోంది. కంపెనీ అభివృద్ధి చేసిన “మిజియా లింగ్యున్ కంట్రోల్ ఇంజిన్” ఆధారంగా పనిచేసే ఈ ఏసీ, వినియోగదారులు నిద్రపోతున్న సమయాల్లో ఆటోమేటిక్‌గా పవర్ వినియోగాన్ని తగ్గిస్తూ గది ఉష్ణోగ్రతను సౌకర్యవంతంగా ఉంచగలదని చెబుతున్నారు.

‘మిజియా ఎయిర్ కండిషనర్ జెయింట్ పవర్ సేవర్ 2026’ ఫీచర్లు
ఈ ఏసీ ప్రధాన ఆకర్షణ దాని పవర్ సేవింగ్ సామర్థ్యమే. ప్రతి సంవత్సరం దాదాపు 208kWh వరకు విద్యుత్‌ను ఆదా చేయగలదని కంపెనీ వెల్లడించింది. పెరుగుతున్న విద్యుత్ చార్జీల నేపథ్యంలో ఈ ఫీచర్ వినియోగదారులను బాగా ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు, ఇందులో అమర్చిన 9.8cc కంప్రెసర్, డ్యూయల్ రో ఎవాపరేటర్, 108mm క్రాస్ ఫ్లో ఫ్యాన్ కలిసి వేగంగా కూలింగ్ అందించేందుకు సహకరిస్తాయి. గంటకు 760 క్యూబిక్ మీటర్ల గాలిని విడుదల చేసే సామర్థ్యం ఈ ఏసీకి ఉందని కంపెనీ పేర్కొంది. సాధారణ గదిని కేవలం మూడు నిమిషాల్లో చల్లబరచగలదని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఏసీ ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే మొబైల్ సాఫ్ట్‌వేర్‌ల మాదిరిగానే భవిష్యత్తులో కొత్త ఫీచర్లు ఆటోమేటిక్‌గా అందుబాటులోకి రావచ్చు. అంతేకాదు, ఇందులో ఉన్న డయాగ్నస్టిక్ సిస్టమ్ ద్వారా నిర్వహణ అవసరాలను యాప్ ద్వారానే ముందుగానే తెలియజేస్తుంది. సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ ఉండటం వల్ల ఏసీ లోపల దుమ్ము, తేమ పేరుకుపోయే అవకాశాలు తగ్గుతాయి. దీని వల్ల దీర్ఘకాలంలో పనితీరు మెరుగ్గా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగానూ ప్రయోజనం కలుగుతుంది.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఈ ఏసీ అత్యంత తక్కువ శబ్దంతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. దాని నాయిస్ లెవెల్ కేవలం 18 డెసిబెల్స్ వరకు మాత్రమే ఉంటుందని సమాచారం. అంటే రాత్రి నిద్రపోయే సమయంలో కూడా శబ్దం వల్ల ఇబ్బంది తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ధర ఎంత ?
చైనా మార్కెట్లో విడుదలైన ఈ “మిజియా ఎయిర్ కండిషనర్ జెయింట్ పవర్ సేవర్ 2026” ధర 1,899 యువాన్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 26,800 వరకు ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు JD.comలో కూడా ఈ మోడల్ లిస్ట్ అయింది. మే 30 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. భవిష్యత్తులో ఈ స్మార్ట్ పవర్ సేవింగ్ ఏసీ భారత మార్కెట్లోకి కూడా వస్తుందా అన్న దానిపై టెక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.