తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఓ వైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు అప్డేట్, తెలంగాణ వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి – ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
ఉత్తర దక్షిణ ద్రోణి ఈరోజు కూడా దక్షిణ బీహార్ పరిసర ప్రాంతాల నుండి జార్ఖండ్ ఒడిస్సా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు ఈ కింది విధంగా ఉన్నాయి:
రాగల 3 రోజులకు వాతావరణ సూచన – (Weather Forecast) : మంగళవారం, బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings): ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని తూర్పు, ఉత్తర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే.. ఏపీలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మోస్తరు వర్షాలతోపాటు.. ఈదురు గాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.




