Reading Time: < 1 minute

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి: ముస్లిం మత పెద్ద డిమాండ్

Caption of Image.

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని.. గోవధపై, బలి కోసం ఆవులను తరలించి చేసే అమ్మకాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గా మత గురువు సయ్యద్ సర్వర్ చిస్తీ కేంద్రాన్ని కోరారు. హిందూ సమాజానికి ఆవులు పరమ పవిత్రమైనవని, హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన గోవులను రాజ్యాంగపరంగా రక్షించాలని ఆయన చెప్పారు. 

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించే చట్టాన్ని తీసుకురావడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చిస్తీ విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లుకు ఎవరు మద్దతు ఇస్తున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో గమనించడం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సున్నితమైన అంశం.. రాజకీయాలకు అతీతంగా ఉండాలని, మత సామరస్య కోణంలో చూడాలని ఆయన చెప్పారు.

ఈ చర్యను ముస్లింలు స్వాగతిస్తారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. పశువులను వదిలివేయడంపై కఠినమైన చట్టాలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆవులు పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత.. ఆవులను రోడ్లపైకి వదిలేస్తున్నారని.. అవి ప్లాస్టిక్ను, చెత్తను తింటున్నాయని ఆయన గుర్తుచేశారు. గోవధకు పాల్పడ్డారనే అనుమానంతో ముస్లింలపై మూక దాడులు జరుగుతున్న ఘటనలపై కూడా చిస్తీ ఆందోళన వ్యక్తం చేశారు.

►ALSO READ | ప్రతి 4 రోజులకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: 15, 19, 23.. తర్వాత 27న పెంచుతారా..?

బీఫ్ ఎగుమతులపై దేశవ్యాప్త నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. దశాబ్దానికి పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ గో సంరక్షణ విషయంలో కఠినమైన చట్టాలను తీసుకురాలేదని బీజేపీని ఆయన విమర్శించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించి, రక్షణ కల్పించాలని గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ సంస్థ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

©️ VIL Media Pvt Ltd.