Reading Time: 2 minutes

పాతబస్తీలో ట్రాఫిక్ కు టాటా… చార్మినార్ జోన్‌‌‌‌ లో 6 ప్రధాన రోడ్ల విస్తరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్

Caption of Image.
  • హెచ్​ సిటీలో భాగంగా రూ.620 కోట్లతో పనులు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇరుకు రోడ్లతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ సతమతమవుతున్న పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని చార్మినార్ జోన్‌‌‌‌లో ఆరు ప్రధాన రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. 

హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌‌‌‌ఫర్మేటివ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టులో భాగంగా రూ.863 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి ప్యాకేజీ-4, ప్యాకేజీ-5లలో జీహెచ్ఎంసీ కమిషనర్ చేసిన సవరణలను ఆమోదిస్తూ ఎంఏఅండ్‌‌‌‌యూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీవో నెంబర్ 554 జారీ చేశారు. భూసేకరణ పురోగతి, టెండర్ల ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు ఈ మార్పులు చేసినట్లు స్పష్టం చేశారు. 

ఐదు రోడ్లు ఒకే ప్యాకేజీ కింద సవరించిన ప్రతిపాదనల ప్రకారం ప్యాకేజీ-4 కింద రూ. 620 కోట్లతో ఒకేసారి ఐదు రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులన్నింటికీ కలిపి ఒకే టెండర్ చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 
సవరించిన ప్రతిపాదనలివే..

1. అజీమ్ హోటల్ నుంచి చర్చి గేట్ వరకు (షోయబ్ హోటల్ నుంచి బాలాపూర్ రోడ్డు) 80 అడుగుల రోడ్డు విస్తరణ (అంచనా వ్యయం రూ.11 కోట్లు)
2. చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్స్ నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా బార్కస్ వరకు 80 అడుగుల రోడ్డు – (రూ. 9 కోట్లు).
3.లక్కీ స్టార్ హోటల్ నుంచి హఫీజ్ బాబా నగర్ వరకు అడుగుల రోడ్డు విస్తరణ- (రూ. 50 కోట్లు)
4.బెంగళూరు నేషనల్​హైవే నుంచి శాస్త్రీపురం జంక్షన్ వరకు 100 అడుగుల రోడ్డు -(రూ. 225 కోట్లు)
5.శాస్త్రీపురం జంక్షన్ నుంచి ఇంజిన్ బౌలి వరకు100 అడుగుల రోడ్డు పనులు -(రూ. 318 కోట్లు) చేపట్టనున్నారు.

ప్యాకేజీ-5 కింద..

రూ. 243 కోట్లతో తులసీనగర్ నుంచి గౌస్ నగర్ వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ పనులను స్పెషల్ టెండర్ ద్వారా చేపట్టనున్నారు. డీపీఆర్, డిజైన్లు, డ్రాయింగ్స్ తయారీ కోసం కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. భూసేకరణ, యుటిలిటీల మార్పులకు సంబంధించి భూసేకరణకు బదులుగా టీడీఆర్ జారీ చేయడం ద్వారా ఆదా అయ్యే నిధులతోనే ఈ అదనపు వ్యయాన్ని సర్దుబాటు చేస్తామని స్పష్టం చేయడంతో ప్రభుత్వం సవరణలకు అంగీకారం తెలిపింది.
 

©️ VIL Media Pvt Ltd.