Reading Time: < 1 minute

ప్రధానిపై ఆ వ్యాఖ్యలు అరాచకం..మోదీని దేశద్రోహిగా సంబోధించిన రాహుల్పై బీజేపీ ఫైర్

Caption of Image.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని దేశ ద్రోహిగా సంబోధిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యాఖ్యలు ఆయన అరాచక మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని తెలిపింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని, ఇందుకుగానూ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం తన నియోజకవర్గం రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలీలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో వివిధ అంశాలపై మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దీనిపై బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ తీవ్రంగా స్పందించారు. ‘‘రాహుల్ వ్యాఖ్యలు ఆయన అరాచక మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి.

ఎన్నికల్లో వరుస ఓటములతో ఆయన నిస్పృహకు లోనైనట్టు తెలుస్తోంది. రాహుల్ మానసిక సమతుల్యతను కోల్పోతున్నట్టు కనిపిస్తోంది’’ అని నబిన్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని, దేశ ప్రజలను కించపరచడమేనని అన్నారు.

‘‘దేశంలో ఉగ్రవాద ఘటనలకు అడ్డుకట్ట వేసి, నక్సలిజాన్ని అంతమొందించి, మువ్వన్నెల జెండా గౌరవాన్ని పెంచిన మోదీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?’’ అని నితిన్ నబిన్ ప్రశ్నించారు.
 

©️ VIL Media Pvt Ltd.