Reading Time: < 1 minute

విజయ్ తో నన్ను పోల్చొద్దు..2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు: పవన్ కళ్యాణ్

Caption of Image.

తమిళనాడులో విజయం సాధించిన  టీవీకే అధినేత విజయ్ తో తనను పోల్చడంపై జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  స్పందించారు.  తమిళనాడు పరిస్థితులకు, ఏపీ రాజకీయాలకు చాలా తేడా  ఉందన్న పవన్.. విజయ్‌తో తనను పోల్చవద్దని కోరారు.

మంగళగిరిలో జనసేన ఉద్యమి ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన పవన్..   నేను ముఖ్యమంత్రి అయిపోవాలని పార్టీ పెట్టలేదు.. సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే జనసేనను స్థాపించానని చెప్పారు. 2019  ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేసినప్పుడు తనను రెండు చోట్లా ఓడించారని, ఏపీలో సమైక్యత కంటే కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని  పవన్ అన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ అని మనమే విభజిస్తుంటే.. కుల నిర్మూలన ఎలా సాధ్యం?అని ప్రశ్నించారు పవన్ .  బాగా చదువుకున్న విద్యార్థులు సైతం ముందు కులం ఏంటని అడుగుతున్న పరిస్థితి దురదృష్టకరం.మతాలు మారినా కులాలు వదలని ఈ సమాజంలో.. కుల నిర్మూలన మాటలకే పరిమితం అవుతోందన్నారు.

తనను ఒకే కులానికి లేదా ప్రాంతానికి పరిమితం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని పవన్  అన్నారు.  తాను ఒక కులంలో పుట్టి ఉండవచ్చు.. కానీ నేను దేశం కోసం పని చేయడానికి వచ్చానని చెప్పారు. కేవలం కాపుల గురించి మాత్రమే కాకుండా.. రెల్లి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని వర్గాల కోసం తాను నిలబడతానని తెలిపారు. 

ఈ సందర్భంగా.. వంగవీటి రంగామరణంపై వస్తున్న విమర్శలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు టీవీల్లో గొంతు చించుకుని అరుస్తున్న వారు.. ఆనాడు రంగా గారికి ప్రాణహాని ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.మనిషి బతికి ఉన్నప్పుడు రక్షించుకోలేని వారు.. చనిపోయాక కథలు చెబితే ఎవరూ నమ్మరు అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులం చూసి ఓట్లు వేస్తారనేది అపోహ మాత్రమేనని.. అదే నిజమైతే తాను గతంలో రెండు చోట్లా ఓడిపోయేవాడిని కాదని పవన్ గుర్తుచేశారు. ప్రజలు కులాల కంటే మార్పునే కోరుకుంటున్నారని ఆయన తన ప్రసంగంలో వెల్లడించారు.రాజకీయాల్లో కులం కంటే మానవత్వమే గొప్పదని, అందరూ గొంతు విప్పి సమాజ మార్పు కోసం పోరాడాలని పవన్ కల్యాణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

©️ VIL Media Pvt Ltd.