
‘జాతిరత్నాలు’, ‘ఖుషి’, ‘ఓం భీమ్ బుష్’ సినిమాలతో థియేటర్లలో నవ్వుల పూయించిన టాలెంటెడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ గుర్తున్నాడుగా? ఎప్పుడూ తన కామెడీ టైమింగ్‌తో అలరించే ఈ నటుడు.. లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా మారాడు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిపై, మేకర్స్ ధోరణిపై ఆయన వేసిన పంచ్‌లు నెట్టింట ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
అసలేం అన్నారంటే?
సినిమాలు ఆడకపోవడానికి ప్రేక్షకులదే తప్పు అన్నట్టు కొందరు బిల్డప్ ఇస్తుంటే, రాహుల్ మాత్రం అసలు నిజాన్ని కడిగిపారేశాడు. తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. “ఎండలు మండిపోతున్నాయి, బయట ట్రాఫిక్ ఘోరంగా ఉంది, పార్కింగ్ కష్టాలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతటి ఆధునిక జీవిత అలసటను మర్చిపోయేలా మీ సినిమా లేనప్పుడు… మిమ్మల్ని నమ్మి జనాలు ఇళ్లు దాటి రావాలని కోరుకోకండి. థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయంటే.. మన పనితనంలో మనం ఎంత ఘోరంగా విఫలమయ్యామో చెప్పడానికి అదే నిజాయితీతో కూడిన తీర్పు” అంటూ కుండబద్దలు కొట్టాడు.
‘ట్వీట్ యాక్టివిజం’పై క్రేజీ ఫైర్!
అంతటితో ఆగకుండా ఇండస్ట్రీలోని కొందరు సోషల్ మీడియా పులులపై రాహుల్ తీవ్రంగా మండిపడ్డాడు. నెట్‌లో ఏదైనా ఇష్యూ ట్రెండ్ అయితే చాలు.. సింహాల్లా, వేటగాళ్లలా గర్జిస్తూ జస్టిస్ కావాలంటూ ఎన్‌కౌంటర్ పోలీసింగ్ చేస్తుంటారు. కానీ నిజంగా బాధ్యత చూపించాల్సిన సమయం వచ్చేసరికి పిల్లుల్లా మారి సైలెంట్ అయిపోతారని ఎద్దేవా చేశాడు. ఇండస్ట్రీలో జరిగే ఈ ఆవేదన అంతా కేవలం సోషల్ మీడియా విజిబిలిటీ కోసమే తప్ప, సమాజంపై నిజమైన ప్రేమతో కాదని చురకలు అంటించాడు.
కంటెంట్ వీక్
ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్లు, భారీ ప్రమోషన్లు ఉన్నా కంటెంట్ వీక్ గా ఉంటే థియేటర్లకు జనాలు రావడం లేదన్నది పచ్చి నిజం. ఓటీటీల కాలంలో ప్రేక్షకులు చాలా సెలెక్టివ్‌గా మారారు. కథలో కొత్తదనం, బలమైన ఎమోషన్స్ ఉంటేనే థియేటర్ టికెట్ కొంటున్నారు. ఇలాంటి టైమ్‌లో రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ‘రియాలిటీ చెక్’ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో పెను దుమారమే రేపుతున్నాయి. ఇప్పటికైనా మేకర్స్ మారాలని, కంటెంట్‌పై దృష్టి పెట్టాలని సగటు సినిమా అభిమాని కోరుకుంటున్నాడు. మరి ఈ క్రేజీ కామెంట్స్‌పై మన మేకర్స్ ఏమంటారో చూడాలి..
And please, for your own sake, let go of the arrogant belief that the audiences are too stupid to recognise bad filmmaking. Almost everyone is camera savvy and adept at filmmaking techniques now thanks to digitalisation.
We still consider our “craft” as some mystical art form🤦🏻♂️— Rahul Ramakrishna (@eyrahul) May 12, 2026