July 11, 2026

Mamata Banerjee: ‘మాజీ’ అని పెట్టుకోను.. మమతా బెనర్జీ ‘X’ బయోలో తెలివైన మార్పు!

Mamata Banerjee: ‘మాజీ’ అని పెట్టుకోను.. మమతా బెనర్జీ ‘X’ బయోలో తెలివైన మార్పు!
Reading Time: 2 minutes
Mamata Banerjee X Bio Change After Bengal Election Defeat

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. అనూహ్య ఓటమితో తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోగా, బీజేపీ తొలిసారి అక్కడ పాగా వేసింది. అయితే, ఈ ఓటమిని జీర్ణించుకోలేక మమతా బెనర్జీ ప్రదర్శించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ, మమతా బెనర్జీ ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అన్నారు. కనీసం గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు ఆమె నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటల వరకు ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) ప్రొఫైల్‌లో “గౌరవనీయ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి” అని ఉండింది. కాగా.. సువేందు అధికారి బీజేపీ తరఫున బెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో మమత నిశ్శబ్దంగా తన ‘X’ బయోలో మార్పులు చేశారు. అయితే ఇక్కడే ఆమె తనదైన శైలిలో తెలివితేటలు ప్రదర్శించారు. ఎక్కడా “మాజీ” (Former) అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. దానికి బదులుగా “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ విధానసభ)” అని మార్చుకున్నారు. అలాగే 1997లో కాంగ్రెస్ నుంచి విడిపోయి తాను స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా తనను తాను పేర్కొన్నారు.

మమతా బెనర్జీ తన ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడంలో జాప్యం చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు ఏకంగా ఎలోన్ మస్క్, ‘ఎక్స్’ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ఆమె బయోను మార్చాలని, అవసరమైతే అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. “మాజీ అని పెట్టుకోవడానికి ఇష్టం లేక, తన పదవీకాలాన్ని తెలివిగా బయోలో చేర్చుకున్నారు” అని ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేయడం ఆమె వైఖరిని స్పష్టం చేస్తోంది. ఏదేమైనా, ఈ మార్పు ద్వారా మమతా పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లయింది. నిజానికి.. మే 7వ తేదీన అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి సభను రద్దు చేశారు. దీనితో మమత ముఖ్యమంత్రి పదవి ఆటోమేటిక్‌గా రద్దయింది. ఆమె మాజీ అని పెట్టుకోకపోయినా.. ఆ పదాన్ని వాడటానికి ఇష్టం లేకపోయినా ఇక మాజీ సీఎంగానే ఉంటారు.

Mamatha