Reading Time: < 1 minute
Kkr Vs Dc Ajinkya Rahane Praises Bowlers After Big Win Ipl 2026

Ajinkya Rahane: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆలస్యంగా పుంజుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) వరుస విజయాలతో దూసుకెళ్తోంది. శుక్రవారం ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట కార్తీక్‌ త్యాగి (2/25), అనుకుల్‌ రాయ్‌ (2/31), సునీల్‌ నరైన్‌ (1/17)ల ధాటికి ఢిల్లీ 8 వికెట్లకు 142 పరుగులే చేసింది. ఛేజింగ్ బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు ఆ లక్ష్యాన్ని 14.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత విజయం సాధించిన అనంతరం కెప్టెన్ అజింక్యా రహానే తన ఆనందాన్ని పంచుకున్నాడు. ప్రధానంగా బౌలర్ల నిలకడైన ప్రదర్శన, ఫీల్డింగ్‌లో వచ్చిన మార్పులు జట్టు విజయానికి ప్రధాన కారణాలని పేర్కొన్నాడు. మొదటి నాలుగు ఐదు మ్యాచ్‌లలో ఇబ్బంది పడినా, ఫిన్ అలెన్ ఈ మ్యాచ్‌లో ఆడిన తీరు అద్భుతమని రహానే ప్రశంసించాడు. అయితే ఈ విజయంలో బౌలర్ల పాత్ర మరువలేనిదని, ముఖ్యంగా మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో వారు ప్రదర్శిస్తున్న పట్టుదల జట్టును గెలిపిస్తోందని చెప్పాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్ వంటి స్పిన్నర్లు నిలకడగా రాణిస్తున్నారని కొనియాడాడు.

ఫీల్డింగ్ విషయంలో కోచ్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, దాని ఫలితమే మైదానంలో కనిపిస్తోందని రహానే తెలిపాడు. క్యాచ్‌లు పట్టడం, గ్రౌండ్ ఫీల్డింగ్‌లో మెరుగుదల వెనుక ఫీల్డింగ్ కోచ్ కృషి ఎంతో ఉందని క్రెడిట్ ఇచ్చాడు. “సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి బౌలర్లు నా జట్టులో ఉండటం నా అదృష్టం. వారికి ఎక్కువగా చెప్పాల్సిన పనిలేదు. నరైన్ నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ, తన అనుభవాన్ని అందరితో పంచుకుంటాడు. ఫీల్డ్‌లో ఎప్పుడు పిలిచినా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు” అని నరైన్‌పై ప్రశంసలు కురిపించారు. బౌలింగ్ కోచ్‌లు టిమ్ సౌథీ, బ్రావోలు బౌలర్లతో చాలా శ్రమిస్తున్నారని రహానే తెలిపాడు. ముఖ్యంగా దేశీవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన అనుకూల్ రాయ్, ఆత్మవిశ్వాసంతో ఉన్న కార్తీక్ త్యాగిల ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ చేసేటప్పుడు కాస్త అసౌకర్యంగా కనిపించినా వరుణ్ చక్రవర్తి ఫిట్‌గా ఉన్నాడని, అతనికి బౌలింగ్ చేయడమే ఇష్టమని రహానే స్పష్టం చేశాడు. కేకేఆర్ ప్రస్తుతానికి ‘ఒక్కో మ్యాచ్‌ను ఒక్కోలా’ (One game at a time) తీసుకుంటూ ముందుకు సాగుతోందని వివరిచాడు.