Reading Time: < 1 minute
Vijay Cabinet List Tvk Government Vck Left Congress Minister Berths Tamil Nadu

హమ్మయ్య.. తమిళనాడులో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ వర్సెస్ విజయ్ మధ్య చర్చలు తీవ్ర టెన్షన్ నెలకొల్పాయి. పూర్తి మెజార్టీతో వస్తేనే అవకాశం ఇస్తానని గవర్నర్ చెప్పడంతో తమిళనాడు పాలిటిక్స్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి చిన్న పార్టీలు విజయ్‌కు సపోర్ట్‌గా నిలబడడంతో ఉత్కంఠకు తెరపడింది.

విజయ్‌కు వామపక్షాలు, వీసీకే పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన మద్దతుతో బలం 112కు చేరింది. ఇప్పుడు సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 1118కు చేరింది. మరికాసేపట్లో గవర్నర్ అర్లేకర్‌ను కలిసి విజయ్ లిస్ట్ అందజేయనున్నారు.

కేబినెట్ బెర్త్‌లు ఖరారు!
ఇక విజయ్ కేబినెట్‌లో వీసీకేకు ఒక మంత్రి పదవి.. వామపక్షాలకు రెండు బెర్త్‌లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్‌కు కూడా కీలక పదవులు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. దాదాపుగా మంత్రివర్గ కూర్పుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇక విజయ్ సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీకే ప్రభుత్వంలో వీసీకేకు ఒక మంత్రి పదవి కేటాయించనున్నారు. అలాగే వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంకు చెరో మంత్రి పదవి ఇచ్చే అవకాశముంది. ఈ మేరకు మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ మూడు పార్టీలకు అసెంబ్లీలో చెరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకే కూటమిలో ఉన్న ఈ పార్టీలు.. రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. స్టాలిన్ కూడా తమ రాజకీయ ప్రయోజనాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని మిత్రపక్షాలకు స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం జరిగిన ఉన్నతస్థాయి చర్చల తర్వాతే ఈ పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.

వీసీకే అధినేత తిరుమావలవన్ స్వయంగా కేబినెట్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా టీవీకే ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం.