చాలా మంది బొంబాయి రవ్వ, సగ్గు బియ్యం, బియ్యం పిండితో వడియాలు చేసుకుంటారు. కానీ వీటితోనే కాకుండా టమాటా రసంతో వడియాలు చేసినా టేస్ట్ అదిరిపోతుందంట. అంతే కాకుండా ఇవి నూనెలో కూడా బాగా వేడి అద్భుతమైన రుచిని ఇస్తాయని చెబుతున్నారు. మరి మంచి రుచిని ఇచ్చే ఈ టమాటాలతో వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దా పదండి.
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా సగ్గు బియ్యం తీసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని కూడామిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై ఓ మందపాటి బౌల్ పెట్టాలి.
ఒక కప్పుడు సగ్గు బియ్యం తీసుకుంటే రెండు కప్పుల నీళ్లు పోయాలి. అలా మీరు ఎన్ని కప్పులు తీసుకున్నారో దానికి అనుగుణంగా నీరు పోసుకోవాలి. ఇప్పుడు నీరు బాగా మరుగుతున్నప్పుడు అందులో సగ్గు బియ్యం పౌడర్ వేసి బాగా కలపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఇందులో టమాటా ప్యూరీ కూడా వేసి దాదాపు 15 నిమిషాల పాటు అది చిక్కగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి.
బాగా చిక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు, కొత్తిమీర తరుగు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి.
ఇప్పుడు ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని, ఒక చిన్న గరిట సహాయంతో మేడపై లేదా, ఇంటి ముందు క్లాత్ పరిచి అందులో ఈ మిశ్రమాన్ని వడియాల రూపంలో వేసి దాదాపు మూడు రోజుల పాటు బాగా ఎండలో ఎండ బెట్టాలి. ఇవి బాగా ఎండిన తర్వాత క్లాత్ వెనక వైపు నీళ్లు చల్లి వీటిని మెల్లిగా తీసుకొని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. అంతే వేయించుకొని తింటే టేస్టీ టేస్టీ టమాటా రసం వడియాలు రెడీ. ఇవి పప్పు, సాంబారే కాకుండా మటన్ తినే సమయంలో నంచుకొని తిన్నా బాగుంటాయంట.




