Reading Time: < 1 minute
Venkatakrishnapalem Tragedy Dsp Reveals Shocking Details In Five Family Death Case

తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భార్య, తల్లిని హత్య చేసి ఇద్దరు బిడ్డలతో రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య హరిత (35), తల్లి చంద్రకళ (60), ఇద్దరు చిన్నారులు (శశాంక్, హిమనీ), తండ్రి మోహన్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పుత్తూరు ఆస్పత్రికి తరలించారు. మార్చురీకి చేరుకున్న మోహన్ బంధువులు.. మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు.

ఐదుగురి మృతిపై పుత్తూరు డీఎస్పీ రవి కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘భార్య హరితను, తల్లి చంద్రకళను మోహన్ చంపేశాడు. సైకలాజికల్ డిజార్డర్తో మోహన్ బాధపడుతున్నట్లు మాకు అనుమానంగా ఉంది. హరితను, చంద్రకళను చంపడానికి మోటివ్ ఏంటనేది విచారణ జరుపుతున్నాం. బ్యూటీ పార్లర్లో ఉన్న హరితను 10 గంటల సమయంలో మోహన్ ఇంటికి తీసుకెళ్లాడు. హరితను ఒక గదిలో, తల్లి చంద్రకళను మరో గదిలో ఉంచి చీరతో గొంతు నులిమి చంపేశాడు. మేనమామ ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాలను మార్చురీకి తరలించాం. ఇద్దరిని చంపిన తర్వాత మోహన్ స్కూల్ వెళ్ళి పిల్లలని తీసుకెళ్లాడు. ఆత్మహత్య చేసుకునేందుకు పిల్లల్ని రైలు పట్టాల దగ్గరికి తీసుకెళ్లాడు. మోహన్ రైలు పట్టాలు మీద పడుకున్నప్పుడు ఇద్దరు బిడ్డలు అతన్ని లాగి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ లోపే ముగ్గురు రైలు డీకొని చనిపోయారు. ఈ కేసులో లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరు ప్రాణాలతో లేరు. మోహన్ కి ఆర్ధిక పరమైన సమస్యలు ఏమీ లేవని దర్యాప్తులో తేలింది. భార్య భర్తల మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి’ అని డీఎస్పీ చెప్పారు.