Reading Time: 2 minutes
FASTag: ఫాస్టాగ్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్.. కొత్త రూల్ ఏంటంటే..?

ఫాస్టాగ్ విషయంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కొత్త నిబంధనలను జారీ చేసింది. మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఫాస్టాగ్ నెంబర్ సరిపోలి ఉండాలి. ఈ మేరకు ఫాస్టాగ్ జారీ చేసే అన్నీ బ్యాంకింగ్ సంస్థలు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్లను వెంటనే ధృవీకరించాలని ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వాహనాలకు వేర్వేరు ఫాస్టాగ్ నెంబర్లు ఉంటే మీ ఫాస్టాగ్‌ను ఇనాక్టివ్ చేసి బ్లాక్ లిస్టులో చేర్చుతారు. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించే సమయంలో ఫాస్టాగ్ రీడర్, వాహనం నంబర్ సరిపోలవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.

బ్యాంకులకు ఆదేశాలు జారీ

టోల్ వసూలు వ్యవస్థలో డేటా ఖచ్చితత్వం, విశ్వసనీయతను మెరుగుపర్చేందుకు, ఫాస్టాగ్‌ టోల్ ఫీజు చెల్లింపులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌ను ఏ రిజిస్ట్రేషన్ నెంబర్‌పై తీసుకున్నారో.. అదే నెంబర్‌పై ఉపయోగిస్తున్నారా..? లేదా ఇతర నెంబర్‌పై వినియోగిస్తున్నారా? అనేది చెక్ చేయాలని బ్యాంకులను కోరింది. వేర్వురు నెంబర్లపై ఉపయోగిస్తుంటే ఫాస్టాగ్‌ను బ్లాక్ చేయాలని సూచించింది. ఫాస్టాగ్ టోల్ ఫీజు చెల్లింపు వ్యవస్థలో ట్యాంపరింగ్‌కు చెక్ పెట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వ్యవస్థలో లీకేజీ జరగకుండా చూసుకునేందుకు, వ్యత్యాసాలను నివారించేందుకు కేంద్రం కొత్త రూల్స్‌ను తెచ్చింది. వాహన డేటాబేస్‌లో నమోదు చేయడానికి ముందే జారీ చేయబడ్డ ఫాస్టాగ్‌లకు సంబంధించిన వాటిల్లో వ్యత్యాసాలు అధిక భాగం జరుగుతున్నాయి. త్వరలో మల్టీ లైన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఫాస్టాగ్‌తో వీఆర్‌ఎన్ మ్యాపింగ్ ఖచ్చితత్వాన్ని నిర్దారించడంపై ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది.

ఈ నెలలోనే కీలక నిర్ణయాలు

ఈ నెలలో ఫాస్టాగ్, టోల్ ఫీజు వ్యవస్థకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి టోల్ ఫీజు చెల్లించేందుకు క్యాష్ పేమెంట్స్‌ను పూర్తిగా నిలిపివేసింది. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే టోల్ చెల్లించాలని ఆదేశించింది. టోల్ చెల్లింపుల్లో డిజిటల్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే టోల్ చెల్లించకుండా ఎగ్గొడితే ఈ-నోటీసులు జారీ చేయడంతో పాటు భారీగా పెనాల్టీ వేయనుంది. ఇక పరిమితికి మంచి నేషనల్ హైవేలపై వాహనాలు ఓవర్ లోడ్‌తో వెళితే భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇలాంటప్పుడు 4 రెట్లు అదనంగా జరిమానా వేయనుంది.