Reading Time: 2 minutes
Rohit Sharma : ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ

Rohit Sharma : ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త అందింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గాయంపై తాజా అప్‌డేట్ వచ్చేసింది. మైదానంలో రోహిత్ పడుతున్న ఇబ్బంది చూసి అతను ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడేమో అని భయపడిన ఫ్యాన్స్‌కు మెడికల్ రిపోర్ట్స్ భారీ ఊరటనిచ్చాయి. ఆర్‌సీబీతో జరిగిన 241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ 13 బంతుల్లో 19 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించాడు. అయితే అకస్మాత్తుగా కండరాలు పట్టేయడంతో నొప్పిని భరించలేక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ అవుట్ కావడం ముంబై బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది, ఆ మ్యాచ్‌లో జట్టు 222 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. మ్యాచ్ ముగిసిన వెంటనే రోహిత్‌కు స్కానింగ్ నిర్వహించగా, కండరాల్లో ఎలాంటి చీలిక లేదని వైద్యులు తేల్చారు. ఇది ముంబై మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఊరట.

గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగుతాడా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గాయం తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, రిస్క్ తీసుకోవాలా లేక ఒక మ్యాచ్ విశ్రాంతి ఇవ్వాలా అని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. ఒకవేళ రోహిత్ పూర్తి స్థాయిలో ఫీల్డింగ్ చేయలేకపోతే, కనీసం బ్యాటింగ్‌లోనైనా ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవాలని ముంబై భావిస్తోంది. ఇవాళ సాయంత్రం జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో అతని ఫిట్‌నెస్‌ను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.

ముంబై ఇండియన్స్ పరిస్థితి ఈ సీజన్‌లో అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. ఈ సమయంలో ఒక ఫ్రాంచైజీ తరఫున 6 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన రోహిత్ జట్టులో ఉండటం అత్యంత అవసరం. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా జట్టు నైతిక స్థైర్యం పెంచడానికి కూడా రోహిత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది.

మరోవైపు ముంబై బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమవుతోంది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ పేసర్లు ధారాళంగా పరుగులు ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్ లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్ వంటి వారు రాణిస్తున్నా, బౌలర్ల వైఫల్యం జట్టు కొంప ముంచుతోంది. పంజాబ్ తో మ్యాచ్ లోనైనా బౌలర్లు పుంజుకుని, రోహిత్ తన బ్యాట్ తో మ్యాజిక్ చేస్తేనే ముంబై గట్టెక్కుతుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..